- సమస్యలకు నిలయంగా వర్సిటీ
- అన్ని డిపార్ట్ మెంట్లలో టీచింగ్ స్టాఫ్ కొరత
- పదేళ్లలో యూనివర్సిటీ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిన పాలకులు
- సమర్థుడైన అడ్మినిస్ట్రేటర్ కోసం విద్యార్థులు, ప్రొఫెసర్ల ఎదురుచూపులు
కరీంనగర్, వెలుగు : అరకొర టీచింగ్ స్టాఫ్, మౌలిక వసతుల్లేక సమస్యలకు నిలయంగా మారిన శాతవాహన యూనివర్సిటీ ప్రక్షాళనకు వేళయింది. కొత్త ప్రభుత్వం త్వరలో కొత్త వీసీల నియామకానికి అనుమతించడంతో యూనివర్సిటీలో ఏళ్లుగా తీరని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విద్యార్థులు, అధ్యాపకులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీని ప్రారంభించి 16 ఏళ్లవుతోంది.
ప్రారంభంలో నిధులు ఇచ్చి భవనాల నిర్మాణం చేపట్టినా.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రస్తుత వీసీ హయాంలో యూనివర్సిటీకి యూజీసీ 12బీ గుర్తింపు సాధించగలిగినా.. కొత్త కోర్సులను మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. ఇతర సమస్యలను సర్కార్ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
డిపార్ట్ మెంట్‌కు ఇద్దరు, ముగ్గురే..
యూనివర్సిటీలో 13 డిపార్ట్‌మెంట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే కోర్సులు తక్కువగా ఉన్నాయంటే ఇందులోనూ కొన్నింటిని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. బాటనీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ కోర్సులు గతంలో రెగ్యులర్ కోర్సులుగా ఉండేవని వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ కింద మార్చడంతో విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులు పెరిగాయి. దీంతోపాటు టీచింగ్ స్టాఫ్ పోస్టులు శాంక్షన్ కాకుండా పోయాయని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక డిపార్ట్ మెంట్ లో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్, ఒకరు ప్రొఫెసర్ ఉండాలి.
కానీ ఎకనామిక్స్ లో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఇద్దరే ఉన్నారు. మరో ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. బాటనీలో ఇద్దరు, మ్యాథ్స్ లో ఇద్దరు, తెలుగులో ఇద్దరు, ఇంగ్లీష్ లో ముగ్గురు టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉండడంతో బోధన కుంటుపడి విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 10 మంజూరు కాగా.. ఇందులో 8 ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 16 కుగాను ఆరుగురే ఉన్నారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 37 మంజూరు కాగా.. 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీన్నిబట్టి ఇన్నేళ్లు అకడమిక్, పరిశోధనలు, బోధనను ఎంత నిర్లక్ష్యంగా వహించారో అర్థం చేసుకోవచ్చు.
కొత్త కోర్సుల్లేవు..
యూనివర్సిటీలో పదేళ్లలో కొత్త కోర్సులను తీసుకురాలేదు. ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ లాంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టినా బోధించేందుకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. యూనివర్సిటీ అనుబంధంగా ఇంజినీరింగ్, బీఈడీ, ఎంఈడీ, లా కాలేజీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు ఉజ్వల పార్కు సమీపంలో ఉన్న ఫార్మసీ కాలేజీ గ్రౌండ్ ప్రహరీ లేక కబ్జాకు గురవుతోంది. ఈ విషయంలో యూనివర్సిటీ అధికారులే కబ్జాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్శిటీ క్యాంపస్ లో ఇండోర్ స్టేడియం, ఫుట్ బాల్ గ్రౌండ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సింథటిక్ ట్రాక్ తదితర నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ చేయించాలి
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు యూనివర్శిటీలను నిర్లక్ష్యం చేసింది. శాతవాహన యూనివర్సిటీ ఏర్పడి 16 ఏళ్లవుతున్నా మౌలిక వసతులు కల్పించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా యూనివర్సిటీకి స్పెషల్ గ్రాంట్స్ కేటాయించాలి. అలాగే ప్రస్తుత వీసీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలి.
- కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్