డెంగ్యూ వ్యాధికి త్వరలో టీకా రానుందా?

డెంగ్యూ వ్యాధికి త్వరలో టీకా రానుందా?

ప్రపంచవ్యాప్తంగా సాలీనా 400 మిలియన్లు,  భారత దేశవ్యాప్తంగా 2.5 లక్షల వరకు డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నట్లు ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  2021లో  దేశవ్యాప్తంగా 1.93 లక్షల డెంగ్యూ కేసులు బయటపడగా, అందులో 346 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఆరు మాసాల్లో 31,464 డెంగ్యూ కేసులు నమోదు అవగా, 36 మరణాలు సంభవించాయి. ఈ కేసుల్లో 80 శాతం కేసుల వరకు తక్కువ ప్రభావంతో చికిత్సతో అదుపు చేయవచ్చు.

2019లో  డబ్ల్యూహెచ్‌‌‌‌ఓ వివరాల ప్రకారం ప్రపంచ మానవాళి అధిక మరణాలకు కారణమైన 10 అనారోగ్యాల్లో  డెంగ్యూ రోగం కూడా ఉండటాన్ని మనం హెచ్చరికగా తీసుకోవాలి.  ఆడ ఏడిస్‌‌‌‌ జాతికి చెందిన దోమకాటు వల్ల  డెంగ్యూ వైరల్‌‌‌‌ వ్యాధి వ్యాపిస్తున్నది. ఉష్ణమండల దేశాల్లో అధికంగా వ్యాపిస్తున్న డెంగ్యూ వ్యాధి నేడు కరేబియన్‌‌‌‌, లాటిన్‌‌‌‌ అమెరికా దేశాల్లో కూడా కనిపిస్తున్నది. 

డెంగ్యూ వ్యాధి నిరోధించే మార్గాలు

దోమ కాటుకు లోనైన తర్వాత 4 నుంచి- 7 రోజుల్లో రోగ లక్షణాలు కనిపిస్తాయి.  పిల్లలు, యువతలో ఈ రోగ లక్షణాలు కనిపించక పోవచ్చు కూడా.  డెంగ్యూ తీవ్రత పెరిగినపుడు ‘డెంగ్యూ హెమరేజ్‌‌‌‌ ఫీవర్‌‌‌‌ లేదా డెంగ్యూ షాక్‌‌‌‌ సిండ్రోమ్‌‌‌‌’ అని పిలుస్తారు.  డెంగ్యూ సోకిన రోగులకు 104 డిగ్రీ ఫారన్‌‌‌‌హీట్‌‌‌‌ జ్వరం, తల నొప్పి, వికారం, వాంతులు, శరీర భాగాల్లో దద్దుర్లు,  గ్రంధుల వాపు, అలసట, కనుబొమ్మల వెనుక నొప్పి, శరీర/కీళ్ల నొప్పులు, ముక్కు/చిగుర్ల నుంచి రక్తస్రావం, రక్త నాళాలు దెబ్బతినడం, మలంలో రక్తం, రక్తంలో ప్లేట్‌‌‌‌లెట్ల కౌంట్‌‌‌‌ పడిపోవడం, కాలేయవాపు, కడుపు నొప్పి, శ్వాస ఇబ్బందులు లాంటి రోగ లక్షణాలు కనిపిస్తాయి. 

షాక్‌‌‌‌కు గురి కావడం, కొన్ని సందర్భాల్లో మరణం అంచుకు చేరడం జరుగుతున్నాయి. డెంగ్యూ వ్యాధి కట్టడికి దోమకాటు నుంచి రక్షణ పొందడమే ఏకైక మార్గమని తెలుసుకోవాలి. శరీరం నిండుగా దుస్తులు ధరించడం, మందమైన బట్టలు వేసుకోవడం, కిటికీలకు దోమతెరలు వాడడం, దోమలను నివారించే వస్తువులు వాడడం, సాయంత్రం/తెల్లవారుజామున దోమలకు దూరంగా,  జాగ్రత్తగా ఉండడం,  పరిసరాల పరిశుభ్రతతో దోమల ఉత్పత్తిని తగ్గించడం, నిలువ నీరు లేకుండా చూసుకోవడం లాంటి చర్యలతో డెంగ్యూ సోకడం తగ్గుతుంది.  రక్త పరీక్ష, డెంగ్యూ సెరాలజీ, డెంగ్యూ వైరస్‌‌‌‌ యాంటిజెన్‌‌‌‌ డిటెక్షన్‌‌‌‌ లాంటి మౌలిక పరీక్షలతో డెంగ్యూ వ్యాధిని నిర్ధారిస్తారు. 

2026లో మార్కెట్​లోకి  డెంగ్యూ టీకాలు

మలిదశ  పరిశోధనలకు మరో  రెండు, మూడు ఏండ్లు పట్టవచ్చని,  అంతిమంగా జనవరి 2026 వరకు డెంగ్యూ టీకాలు మార్కెట్​లో వినియోగానికి సిద్ధంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు  చెందిన నేషనల్‌‌‌‌ ఇన్​స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఐహెచ్‌‌‌‌) సహకారంతో  ఐఐఎల్‌‌‌‌ చేస్తున్న డెంగ్యూ టీకా అభివృద్ధి ప్రయోగాలు సఫలం కావాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్నాం.

ఫేజ్‌‌‌‌-1,  ఫేజ్‌‌‌‌-2,  ఫేజ్‌‌‌‌-3 అనబడే మూడుదశల్లో 

ప్రయోగాలు నిర్వహించిన తర్వాత మాత్రమే టీకాలు వినియోగానికి అనుమతులను పొందుతాయని మనకు తెలుసు.  ఐఐఎల్‌‌‌‌తో పాటు సీరమ్‌‌‌‌ ఇన్​స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా, పనేసియా బయోటెక్‌‌‌‌ సంస్థలు కూడా డెంగ్యూ టీకాల అన్వేషణ పరిశోధనలను అధ్యయనాలు చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న డెంగ్యూ కేసులతో పాటు కొత్త జాతులు విజృంభించడం వల్ల  వ్యాక్సిన్‌‌‌‌ ఉత్పత్తి మాత్రమే ఏకైక మార్గమని  వైద్యరంగ నిపుణులు వివరిస్తున్నారు.  

ప్రముఖ టీకా కంపెనీ  ఐఐఎల్‌‌‌‌ ద్వారా 2023-–24లో  రూ.13 బిలియన్  విలువైన వివిధ జంతు/మానవ వినియోగ టీకాలను 50కి పైగా దేశాలకు ఎగుమతులను చేస్తున్నట్లు, ర్యాబిస్‌‌‌‌ టీకా అమ్మకాల్లో 35 శాతం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తున్నది.  ప్రస్తుతం నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌‌‌‌లను నియంత్రించగల టీకా కోసం ప్రపంచ మానవాళి ఎదురు చూస్తున్నది.  సత్వరమే డెంగ్యూ వ్యాధికి చరమగీతం పాడే సమర్థవంతమైన డెంగ్యూ టీకా అందుబాటులోకి రావాలని కోరుకుందాం, వ్యాక్సిన్‌‌‌‌ అధ్యయనంలో నిమగ్నమైన శాస్త్రజ్ఞులకు ‘ఆల్‌‌‌‌ ది బెస్ట్‌‌‌‌’ తెలియజేద్దాం. 

హైదరాబాద్ ఐఐఎల్‌‌‌‌ కేంద్రంగా.. డెంగ్యూ టీకా‌‌‌‌ పరిశోధనలు

డెంగ్యూ వ్యాధి కట్టడికి క్రియాశీలత టీకాలు అందుబాటులో లేనప్పటికీ డెంగ్‌‌‌‌వాక్సియా అనే ఒక ఔషధం.. ముఖ్యంగా పిల్లల చికిత్సకు అందుబాటులో ఉన్నప్పటికీ దీని ప్రయోజన ఆధారాలు ప్రకటితం కాలేదు.  టీకా తయారీలో ఖ్యాతిగాంచిన హైదరాబాద్​కు చెందిన  ‘ఇండియన్‌‌‌‌ ఇమ్యూనోలాజికల్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఐఐఎల్‌‌‌‌) సంస్థ జనవరి 2026 నాటికి  ప్రాణాంతక డెంగ్యూ వ్యాధికి ప్రపంచంలోనే తొలిసారిగా టీకాను వాణిజ్యపరంగా తీసుకురానున్నదనే వార్త విశ్వ మానవాళికి ఉపశమనాన్ని కలిగిస్తున్నది.

దోమకాటుతో  సంక్రమించే  ప్రమాదకర  డెంగ్యూ వ్యాధి  సోకి  తీవ్ర  ప్రజారోగ్య సమస్యగా అవతరించడమే కాకుండా,  కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడంతోపాటు వేలల్లో రోగులు అకాల మరణాల అంచుకు చేరుతున్న విషయం మనకు విదితమే.  2020 నుంచి 2021 మధ్య కాలంలో 333 శాతం డెంగ్యూ కేసులు పెరగడం,  కరోనా కాలంలో 2021 నుంచి 2022 మధ్య 21శాతం కేసులు పెరగడం గమనించారు.  డెంగ్యూ  టీకా తయారీ తొలిదశలో (ఫేజ్‌‌‌‌-1) 18-నుంచి 50  ఏండ్ల వయస్సుగల 90 మంది పౌరులపై  ప్రయోగాలు జరిగాయని, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని,  ఎలాంటి  ప్రతికూల ఫలితాలు గమనించలేదని ఐఐఎల్‌‌‌‌ అధికారులు వెల్లడించడం హర్షదాయకం.

డాక్టర్​
 బుర్ర మధుసూదన్ రెడ్డి