టీజీపీఎస్సీ ఏర్పడిన తొలినాళ్లలోనే రాష్ట్రానికి అవసరమైన అధికారులను, ఉద్యోగులను అందించే ఉద్దేశంతో జరపబోయే నియామకప్రక్రియలో సిలబస్‌కి ప్రాధా న్యత ఇచ్చి, గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలతోపాటు వివిధ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువత కోసం సిలబస్ రూపొందించారు.
దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇందులో ప్రొ. హరగోపాల్, ప్రొ. కోదండరాంతో పాటు వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లకు బాధ్యతల్ని అప్పగించారు. అందరి కృషితో సిలబస్ రూపొందింది.
కానీ, కాలానుగుణంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు జరగలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో లక్షలాది మంది యువత గ్రూప్స్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూను తొలగించింది.
గ్రూప్ 1 ఉద్యోగార్థులు మొదట ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై తర్వాత మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో వచ్చిన మార్కులను బట్టి ఆయా రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయి. గ్రూప్ 1 మెయిన్స్‌లో ఇంగ్లీష్ కనీస అర్హత పరీక్షగా ఉండి, ఆరు పేపర్లు ఒక్కోటి 150 మార్కులతో ర్యాంక్‌ను నిర్ధారించే స్థితిలో ఉంటాయి.
తెలుగును క్వాలిఫైయింగ్ పేపర్‌గా పెట్టాలి
చాలామంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు మీడియంలో చదివినవాళ్లు ఉంటారు. అదేవిధంగా నగరాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివినవాళ్ళు కూడా ఈ పరీక్షకు హాజరవుతారు.
కాబట్టి, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టినపుడు, తెలుగు రాష్ట్ర అధికార భాష కాబట్టి రేపటి రోజున ఉద్యోగార్థులు గ్రూప్ 1 అధికారులై పనిచేసేది తెలంగాణలోనే. వారి వద్దకు వచ్చే సామాన్య ప్రజానీకం వారి సమస్యలను ఎక్కువగా తెలుగులోనే అధికారుల వద్దకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది.
అందువల్ల తెలుగును కూడా క్వాలిఫైయింగ్ పేపర్‌గా పెట్టాలి. సివిల్ సర్వీస్ పరీక్షల్లో కూడా ఇంగ్లీష్ తో పాటు ఒక భారతీయ భాష అన్నది క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిపైన టీజీపీఎస్సీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇక మిగిలిన స్కోరింగ్ పేపర్లలో కూడా మొదటి పేపర్ జనరల్ ఎస్సే, రెండో పేపర్ హిస్టరీ భాగం మినహాయించి ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ కూడా మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం ఉంది.
మూడు, నాలుగు, ఐదో పేపర్లలో సమకాలీన రాజకీయ అంశాలని పొందుపరిస్తే బాగుంటుంది. ఎందుకంటే మొన్న జరిగిన గ్రూప్ 1 మెయిన్స్.. సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షలో సమకాలీన ప్రశ్నలు కాకుండా ఐదు, ఆరేండ్ల క్రితం జరిగిన శాస్త్ర సాంకేతిక విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారని ఉద్యోగార్థులు వాపోయారు.
ఆరో పేపర్ తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావానికి ప్రామాణిక పుస్తకాలు కూడా సూచిస్తే బాగుంటుంది. గ్రూప్ 2 లో నాలుగు పేపర్లు, గ్రూప్ 3లో మూడు పేపర్లు ఒక్కోటి 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 150 మార్కుల రూపంలో ఉన్నాయి. రానున్న రోజుల్లో గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు కలిపి గ్రూప్ 3గా పరీక్షలు
నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో పేర్కొనడం జరిగింది.
ప్రామాణిక పుస్తకాలు టీజీపీఎస్సీ వెల్లడించాలి
మార్కెట్లో ఎన్ని ప్రయివేట్ కోచింగ్ సెంటర్లు, రచయితల పుస్తకాలు ఉన్నా ఎక్కువమంది విద్యార్థి, నిరుద్యోగులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఇప్పటికీ తెలుగు అకాడమీ పుస్తకాలే ప్రామాణికం.
అటువంటి పుస్తకాలు ప్రామాణికం కావంటూ టీజీపీఎస్సీ తరపున న్యాయవాదులు సాక్షాత్తు హైకోర్టులో చెప్పడంతో లక్షలాది మంది నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వాస్తవానికి తెలుగు అకాడమీ పుస్తకాలు రాసిన వాళ్ళందరూ నిష్ణాతులైన, వివిధ యూనివర్సిటీ, కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు. కోర్టుల్లో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంకావు.
వికీపీడియా ఆధారంగా ఫైనల్ కీ తయారు చేసినట్టు చెప్పడం భావ్యం కాదు. తెలుగు అకాడమీ పుస్తకాల్లో వివరణాత్మక విశ్లేషణలు ఉండి అందరికీ అర్థమయ్యే సరళ భాషలో ఉంటాయి. కానీ, ఐదేండ్ల కింద రాసిన పుస్తకాలే పునర్ ముద్రితమవుతాయి.
సిలబస్ అప్డేట్ చేయాలి
సమకాలీన అంశాల్ని పొందుపరచకపోవడం వల్ల ఉద్యోగార్థులు ఇతర ప్రయివేట్ ఇన్స్టిట్యూట్స్ పుస్తకాల వైపు వెళ్తున్నారు. తెలుగు అకాడమీ కూడా తమ పుస్తకాల్లో ఏడాదికొకసారి సమకాలీన అంశాలని పొందుపరిస్తే నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు.. గెలిచిన తర్వాత మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో కోర్టు కేసులు, వాయిదాలు దాటుకుని దాదాపు 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయడం హర్షణీయం.
రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణ తర్వాత జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నట్టు నియామక ప్రక్రియ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది.
ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ రాబోయే పరీక్షల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ప్రామాణిక పుస్తకాలు ఏమిటో తెలియజేస్తే బాగుంటుంది.
- డా. అక్కెనపల్లి వెంకట్రామ్ రెడ్డి,అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐలమ్మ మహిళా యూనివర్సిటీ