
హైదరాబాద్: స్టార్ బ్యాటింగ్ లైనప్ అందుబాటులో ఉన్నా సమష్టిగా ఆడటంలో విఫలమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో పోరుకు రెడీ అయ్యింది. బుధవారం (ఏప్రిల్ 23) ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి తిరిగి గాడిలో పడటంతో పాటు గత మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం కూడా తీర్చుకోవాలని భావిస్తోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలతో 9వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్‌లో బ్యాటర్లు మెరవాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌హెచ్ ఒకే డైమెన్షనల్ జట్టుగా ముద్ర పడింది. ఫ్లాట్ వికెట్లపై మినహా టర్నింగ్ పిచ్‌లపై ఆడలేదని గత మ్యాచ్‌లతో ఇది నిరూపితమైంది. ఇప్పుడు ఈ అపవాదు చెరిగిపోవాలంటే బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా చెలరేగాలి. పవర్‌ప్లేలో అభిషేక్ భారీగా రన్స్ చేస్తున్నా, ట్రావిస్ హెడ్ పదేపదే నిరాశపరుస్తున్నాడు. మిగతా లైనప్‌లో ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్, క్లాసెన్, అనికేత్ వర్మ బ్యాట్లకు సరైన పని చెప్పడం లేదు. బౌలింగ్‌లో కమిన్స్ మెరుస్తున్నా.. షమీ, హర్షల్ పటేల్ నుంచి ఆశించిన మెరుపుల్లేవు.
ఎషాన్ మలింగ, జీషన్ అన్సారీ ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. మరోవైపు లీగ్ ఆరంభంలో ఇబ్బందిపడ్డ ముంబై ప్రస్తుతం గాడిలో పడింది. హ్యాట్రిక్ విజయాలతో జోరందుకుంది. సన్ రైజర్స్ ను ఓడించిన తర్వాత చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో 177 రన్స్ లక్ష్యాన్ని 26 బాల్స్ మిగిలి ఉండగానే ఛేదించడం కాన్ఫిడెన్స్ పెంచే అంశం. ముఖ్యంగా హిట్‌మ్యాన్ రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి రావడం ముంబైకి కొండంత బలాన్నిస్తోంది. సూర్యకుమార్, విల్ జాక్స్, తిలక్ వర్మ కూడా చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు. బుమ్రా రాకతో బౌలింగ్ బలం బాగా పెరిగింది. బౌల్ట్, దీపక్ చహర్, పాండ్యా కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు. స్పిన్నర్లు శాంట్నర్, అశ్వని కుమార్‌కు అండగా పార్ట్‌టైమర్ విల్ జాక్స్ రన్స్ కట్టడి చేయడం సానుకూలాంశం.