రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ట్రంప్ ముగింపు పలికేనా?

రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ట్రంప్ ముగింపు పలికేనా?

రష్యా-ఉక్రెయిన్​మధ్య  జరుగుతున్న యుద్ధం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో  సంవత్సరంలోకి  ప్రవేశిస్తున్నది.  ఈ సందర్భంలో  ట్రంప్ శాంతిగీతంతో  యుద్ధం ముగిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ యుద్ధంలో  ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి.  లక్షల సంఖ్యలో సైనికులు  మరణించారు. సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోయారు.  ఎన్నో ఆకాశహర్మ్యాలు నేలమట్టమయ్యాయి.  ఇరుదేశాలు తీవ్రంగా  నష్టపోవడమే కాకుండా పలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.  మొదట్లో  ఇరుదేశాల మధ్య సాగిన మాటల యుద్ధం... అణ్వస్త్ర యుద్ధానికి దారితీసి,  మూడో  ప్రపంచ యుద్ధం సంభవిస్తుందేమోనన్న  సందేహంతో ప్రపంచం భీతిల్లింది.  అయితే,  ఇరు దేశాలు అణ్వాయుధాల జోలికి పోకుండా,  సంయమనం పాటించాయనే చెప్పాలి.  

అమెరికా  ప్రోద్బలంతోనే  ఇంతకాలం బలమైన ఆయుధ సంపత్తిగల రష్యాతో  ఉక్రెయిన్ యుద్ధం చేయగలిగింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని నాలుగో వంతు భూభాగాలను స్వాధీనం చేసుకుంది. ఆ భూభాగాల్లోని  ప్రజలంతా రష్యా  అధీనంలో కొనసాగుతున్నారు. అలాగే, రష్యాలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్​కూడా ఆక్రమించుకుంది.


ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్ స్కీ  రష్యాతో భూభాగాన్ని మార్చుకోవడానికి సిద్ధపడడం విశేషం. తమ అధీనంలోని భూభాగాన్ని రష్యాకు అప్పగిస్తాననడం కొసమెరుపు. ఇందుకు రష్యా అంగీకరించదన్న విషయం తెలిసిందే. అయితే రష్యా ఆక్రమించిన భూభాగాలను ఉక్రెయిన్​కు అప్పగించడం జరగని పని.  ఉక్రెయిన్ రష్యాతో తలపడడమే పెద్ద సాహసం.  నాటోలో  చేరిక వలన అమెరికా, దాని మిత్ర దేశాలు తమకు అండగా ఉంటాయని, రష్యా తమపై దాడికి  భయపడుతుందని భావనతో  జెలెన్ స్కీ  రష్యాను ఎదిరించారు. నాటో దళాలు ఉక్రెయిన్ దేశ  సరిహద్దుల్లోకి వస్తే అది రష్యా  సమగ్రతకు, సార్వభౌమత్వానికి ముప్పుగా రష్యా భావించింది. అందుకే, నాటోలో ఉక్రెయిన్  చేరికను రష్యా  మొదటి  నుంచీ వ్యతిరేకిస్తూనే ఉంది.  డోనాల్డ్ ట్రంప్  కూడా మాస్కో వాదనను సమర్థించడం జరిగింది.  మాస్కో, కీవ్  మధ్య  సంప్రదింపులకు  ట్రంప్  మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు.  తాను అధికారంలోకి  వస్తే  రష్యా ఉక్రెయిన్​ల మధ్య యుద్ధాన్ని  నిలిపేస్తానని ట్రంప్ అమెరికా అధ్యక్ష  ఎన్నికల ప్రచారంలోనే పేర్కొన్నారు. 

ఉక్రెయిన్ వనరులపై అమెరికా కన్ను?

యుద్దానంతరం  ఉక్రెయిన్ పునర్నిర్మాణం పేరుతో  అమెరికా  ఉక్రెయిన్​లో వాలిపోతుంది.  అమెరికా  కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు, మైనింగ్ 
మాంత్రికులంతా ఉక్రెయిన్​ను స్వర్గధామంలా  మారుస్తామని ఆ దేశంలోని సమస్త సంపద అమెరికాకు ధారాదత్తం చేయనున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను నిలబెడతామంటూ కొద్దిపాటి ఆర్థిక సహాయం చేసి, కొన్ని ఆకాశ హర్మ్యాలు, రహదారులను నిర్మించి ఆ దేశ సంపదను అమెరికా తరలించుకుపోనుందా?  ఒకప్పుడు క్రూరమైన తాలిబాన్ల పాలన నుంచి అమాయక ప్రజలను, మహిళలను కాపాడడానికి అఫ్గానిస్తాన్​లో  అడుగుపెట్టిన అమెరికా  తాలిబాన్లను  తరిమికొట్టి తమ కనుసన్నల్లో మెలిగే  ప్రభుత్వాన్ని అఫ్గాన్​లో  నెలకొల్పింది.  

ఒకవైపు అభివృద్ధి పేరుతో మభ్యపెట్టి, విద్యా ఉపాధి అవకాశాలను మెరుగు పరచినట్టు నటించి,  కీలకమైన సమయంలో  ఆ దేశాన్ని తిరిగి  తాలిబాన్లకు  అప్పగించింది.  ఉక్రెయిన్  విషయంలో కూడా అమెరికా అదే ట్రీట్​మెంట్ ను అమలు చేసే అవకాశం లేకపోలేదేమో! దీంతో  తన బలం మీద ఆధార పడకుండా.. అమెరికా, నాటో దేశాలను నమ్ముకుని యుద్ధరంగంలోకి దిగి మోసపోయిన ఉక్రెయిన్ నిస్సహాయంగా మిగిలిపోనుందా?  


అమెరికాకు చైనా శత్రు దేశమే

ట్రంప్ అన్నట్లుగా  ఎప్పటికైనా  ఉక్రెయిన్  రష్యా పరంకాక  తప్పదా అనే ప్రశ్న తలెత్తుతోంది. పెద్దన్నగా  అధికారం చెలాయించే  అమెరికా  కేవలం  తన  ప్రయోజనాల కోసమే  పాకులాడుతోందనేది వాస్తవం.  భారత్​కు  పొరుగున పొంచి ఉన్న  డ్రాగన్  దేశం కారణంగా అమెరికాతో స్నేహపూర్వకంగా ప్రవర్తించక తప్పడం లేదు. భారత్​తో పాటు  అమెరికాకు కూడా చైనా శత్రుదేశమే. కానీ, శత్రువుకు  శత్రువు.. మిత్రుడన్న చందంగా భారత్ అమెరికాతో  మిత్రత్వం కలిగి ఉంది.  క్వాడ్ కూటమిలో చేరింది.  ఇండియా,  అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో  కూడిన క్వాడ్  కలయిక  చైనాకు రుచించడం లేదు.  

అమెరికా చేతిలో నిర్ణయం

యుద్ధాన్ని కొనసాగించడమా?  ముగింపు పలకడమా? అనే అంశం ప్రస్తుతం  అమెరికా చేతిలోనే ఉంది.  సౌదీ అరేబియా తటస్థ వేదికగా జరిగే  ట్రంప్,-  పుతిన్ భేటీలో రష్యా-, ఉక్రెయిన్ యుద్ధ విరమణకు ఒక అర్థవంతమైన  పరిష్కారం  లభించే  అవకాశాన్ని తోసి పుచ్చలేం. ఇప్పటివరకు అమెరికా,  నాటో దేశాలు అందిస్తున్న ఆయుధ  సహాయం నిలిపివేస్తే,  ఉక్రెయిన్ నిస్సహాయంగా మారక తప్పదు.  

సంధి కోసం వెంపర్లాడక తప్పదు. ఇది  ట్రంప్​కు తెలియని విషయమేమీ కాదు. 
జో బైడెన్  ప్రోత్సాహంతో ఉక్రెయిన్ రష్యాతో తలపడింది.  బైడెన్​కు  బద్ధ శత్రువైన ట్రంప్..  బైడెన్ విధానాలకు వ్యతిరేకంగానే  ఉంటారననేది వాస్తవం. ఉక్రెయిన్-, రష్యాల మధ్య సుదీర్ఘంగా  కొనసాగుతున్న యుద్ధానికి  ముగింపు పలకాలని  కోరుకోవడం సముచితమే.  అయినప్పటికీ, ఇందులో అమెరికా స్వార్థం లేకపోలేదేమో!  ఉక్రెయిన్ లో  ఉన్న సహజ సంపదను కొల్లగొట్టడమే ట్రంప్  ధ్యేయమేమో!   ఇందుకు  జెలెస్కీ అంగీకరించడం  ఉక్రెయిన్  ప్రజలకు రుచించకపోవచ్చు. 

- సుంకవల్లి సత్తిరాజు,
సోషల్ ఎనలిస్ట్