నెట్​ను తొలగిస్తారా!

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా (యూజీసీ) 1956 ప్రకారం భారత ప్రభుత్వంలోని ఉన్నత విద్యా మంత్రిత్వశాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఇది ఉన్నత విద్యా ప్రమాణాలు, సమన్వయం, నిర్ణయం, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  దేశంలోని డిగ్రీ కళాశాలలకు,  విశ్వవిద్యాలయాలకు గుర్తింపును,న్యాక్ గ్రేడ్ ను, 12బి గుర్తింపును  ఇస్తోంది. ఈ గుర్తింపు పొందిన డిగ్రీ కళాశాలలకు,  విశ్వవిద్యాలయాలకు నిధులను పంపిణీ  చేస్తోంది. విశ్వవిద్యాలయాలు,  డిగ్రీ  కళాశాలల్లో బోధించే అధ్యాపకులకు ఏ అర్హతలు ఉండాలనేది యూజీసీ నిర్ణయిస్తోంది.  యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నియమ, నిబంధనలు మారుస్తూ ఉంటుంది.అదేవిధంగా ప్రొఫెసర్స్ జీతభత్యాలను సవరిస్తుంది. 

విశ్వవిద్యాలయాలు,  కళాశాలల్లో ఆచార్యుల నియామకాలు, ప్రమోషన్స్ కోసం కనీస అర్హతలు, ప్రస్తుత ఉన్నతవిద్యలో  ప్రమాణాల నిర్వహణ పేరుతో యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు -2025ను, జనవరి 6న ఒక డ్రాఫ్ట్ రూపంలో విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి 5నాటికి ప్రజాభిప్రాయం తీసుకుని, నూతన మార్గదర్శకాలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు 2025ను పరిశీలిస్తే.. అవి  వీసీలు,  సహాయ ఆచార్యుల నియామకాల విధానం భావి భారత డిగ్రీ, పీజీ, విశ్వవిద్యాలయాల విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి  నెట్టేవిధంగా ఉన్నవి. 

ప్రస్తుతం అమలులో ఉన్న 2018 నాటి  నిబంధనల ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేషన్​లో చదివిన సబ్జెక్ట్,  అదే  సబ్జెక్టులో నేషనల్​ ఎలిజిబిలిటీ  టెస్ట్​( నెట్)లో ఉత్తీర్ణత సాధిస్తే.. వారు  డిగ్రీ , పీజీ కాలేజీ, విశ్వవిద్యాలయాలలో సహాయ ఆచార్యులుగా అర్హులు అని పేర్కొన్నది.  ఇది ఉన్నతమైన, ఉత్తమమైన నిర్ణయంగా మేధావులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, సీఎస్​ఐఆర్​ లేదా యూజీసీ  నెట్ అనే పరీక్ష  సంవత్సరంలో  రెండు దఫాలు నిర్వహిస్తారు.  

నెట్ క్వాలిఫై కష్టసాధ్యం

జులై 2024  సీఎస్ఐఆర్​ నెట్​ పరీక్షకు 2,25,335 అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 1,63,529 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో  జేఆర్ఎఫ్​కు అర్హత సాధించినవారు 1,875 మంది,  సహాయ ఆచార్యులుగా అర్హత సాధించినవారు 3,172 మంది.  అదేవిధంగా యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నవారు 11,21,225 మంది  ఉండగా వీరిలో పరీక్షకు హాజరైనవారు 6,84,224 మంది.  జేఆర్ఎఫ్​కు  అర్హత సాధించిన వారు 4,970 మంది ఉన్నారు.  సహాయ ఆచార్యులుగా అర్హత సాధించినవారు 53,694 మంది అభ్యర్థులు.  అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్ పరీక్ష తీరుతెన్నులు చూస్తే తెలంగాణ సెట్, 2024  పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నవారు 33,494 ఇందులో 26,294 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనారు.  ఇందులో 1,884 (7.17%) మాత్రమే అర్హత సాధించారు. ఈ సమాచారం  అవగాహన  చేసుకుంటే  నెట్,  సెట్​లలో అర్హత సాధించటం అంత సులువైన విషయంకాదు.

నెట్​పై యూజీసీ యూటర్న్​

 నెట్, సెట్ పరీక్షలో సంబంధిత విషయ పరిజ్ఞానం,  లోతైన అవగాహన అభ్యర్థులకు ఉందా? ప్రస్తుత పరిస్థితులకు  సబ్జెక్ట్​లను ఎలా అనుసంధానిస్తు
న్నారు అని లోతుగా పరీక్షించే విధంగా ప్రశ్నల సరళి ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారు పీహెచ్డీ  చేసినవారు డిగ్రీ, పీజీ కళాశాలలో,  ఇంజినీరింగ్ కళాశాలలో,  విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులుగా ఉంటే  ఉత్తమంగా సబ్జెక్టుల బోధన, పరిశోధన జరుగుతుంది. దీని ఫలితంగా యూనివర్సిటీలలో బోధన ఫలవంతంగా సాగుతుంది.  భవిష్యత్ తరాలు ప్రపంచంతో  పోటీపడి ముందువరుసలో ఉంటాయి. 

ప్రస్తుత యూజీసీ  ముసాయిదా మార్గదర్శకాలు - 2025లో నెట్ అవసరం లేకుండా  మాస్టర్స్ ఉంటే చాలు అనే విషయం సమంజసంగా లేదు. ఎందుకంటే.. యూనివర్సిటీలు పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపడుతున్నాయి. కానీ, ఆ విదానంతో  ప్రైవేట్ కళాశాలలో ప్రవేశం పొందినవారు ఏవిధంగా విద్యను పొందుతున్నారో,  పట్టాల ప్రదానం ఎలా జరుగుతోందో  తెలిసిందే.  నేడు దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీల ప్రవేశం అభినందనీయం. కానీ, వాటిలో కొన్ని  యూనివర్సిటీల నుంచి  పీజీ పట్టాలు తీసుకున్న అభ్యర్థులకు,  నేర్చుకున్న సబ్జెక్టులపై కనీస అవగాహన లేదు  అనేది చాలా మంది మేధావులు బహిరంగంగానే  చెబుతున్నారు.  అదేవిధంగా ఎంఈ/ ఎంటెక్​ చేసినవారికి సంబంధిత సబ్జెక్ట్​లో ఎంతమేరకు విషయ అవగాహన ఉందో ప్రశ్నార్థకమే.

యూజీసీ మార్గదర్శకాలు పున:సమీక్షించాలి

కాంట్రాక్ట్ లెక్చరర్స్ ను  పెర్మనెంట్ చేసే క్రమంలో వెలుగు చూసిన నకిలీ సర్టిఫికెట్స్  విషయం తలుచుకుంటే  ఆందోళన కలగకమానదు.  ఈ పరిస్థితుల్లో  ఇలాంటివారు ఒకవేళ యూనివర్సిటీలలో డిగ్రీ,  ఇంజినీరింగ్ కాలేజీల్లో  లొసుగులను ఆసరా చేసుకుని ప్రవేశిస్తే విద్యార్థుల భవిష్యత్ ఏమిటి అనేది వెయ్యిమిలియన్ల ప్రశ్న.  యూజీసీ ఎవరి ప్రభావాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా సమాజ శ్రేయస్సును ఆలోచించి భావి భారతానికి బంగారు బాటలు వేయాలి. కాబట్టి, యూజీసీ  సరైన నిర్ణయం తీసుకుని భారత దేశ ప్రగతిలో  క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆశిద్దాం.   ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తిమంతమైన ఆయుధం విద్య అని నెల్సన్ మండేలా అన్నాడు.  అది నాణ్యమైన విద్యతోనే సాధ్యం. కావున, నాణ్యమైన విద్యను ప్రోత్సహించేలా యూజీసీ నిర్ణయాలు ఉన్నతంగా, ఉత్తమంగా  అందరి మన్ననలు పొందేలా ఉండాలని కోరుకుందాం.

మహేశ్వరం భాగ్యలక్ష్మి 
అసిస్టెంట్ ప్రొఫెసర్