వక్ఫ్ బోర్డులో ముస్లింలే ఉండాలి.. హిందూ ట్రస్టుల్లో ముస్లింలను అనుమతిస్తరా? అని కేంద్రానికి సుప్రీం ప్రశ్న

వక్ఫ్ బోర్డులో ముస్లింలే ఉండాలి.. హిందూ ట్రస్టుల్లో ముస్లింలను అనుమతిస్తరా? అని కేంద్రానికి సుప్రీం ప్రశ్న
  • ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రమే ఏ మతం వాళ్లైనా ఉండొచ్చు
  • వక్ఫ్ సవరణ చట్టంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 
  • హిందూ ట్రస్టుల్లో ముస్లింలను అనుమతిస్తరా? అని కేంద్రానికి ప్రశ్న
  • మధ్యంతర ఉత్తర్వుల జారీ దిశగా సంకేతాలు 
  • తదుపరి విచారణ నేటికి వాయిదా

న్యూఢిల్లీ: వక్ఫ్ ​సవరణ చట్టంలో ప్రధానంగా మూడు అంశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అమలులోకి వచ్చిన వక్ఫ్​సవరణ చట్టంలో ‘వక్ఫ్​ బై యూజర్’గా పేర్కొన్న ఆస్తులను కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చేయరాదని ప్రతిపాదించింది. అలాగే అన్ని వక్ఫ్​బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో సభ్యులంతా తప్పనిసరిగా ముస్లింలే ఉండాలని, ఎక్స్ అఫీషియో మెంబర్లు మాత్రం ఏ మతం వారైనా ఉండొచ్చని.. కొత్త చట్టంలో పేర్కొన్నట్టుగా కలెక్టర్ ప్రొసీడింగ్స్ కొనసాగించవచ్చు కానీ సంబంధిత నిబంధనలు మాత్రం వర్తింపచేయరాదని ప్రపోజల్స్ పెట్టింది. 

వక్ఫ్​సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 73 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు చీఫ్ ​జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్​తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.  శాసన వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన అధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమని, అయితే ఈ చట్టం సమానత్వపు హక్కు, మత విశ్వాసాలను పాటించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందంటూ పిటిషన్లు దాఖలైనందున వాదనలను వింటున్నామని స్పష్టం చేసింది.

వక్ఫ్ సవరణ చట్టంలోని ఈ మూడు అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే దిశగా సానుకూలత వ్యక్తం చేసిన బెంచ్ ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది.  ‘‘సాధారణంగా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులను మేం జారీ చేయం. కానీ దీనిని వేరుగా చూడాలి. ఈ కేసులో హియరింగ్ ఆరు నుంచి ఎనిమిది నెలల వరకూ కొనసాగే అవకాశం ఉంది” అని బెంచ్ తెలిపింది. అయితే, ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలను వినాలని కోరింది. మరో అరగంట సమయం ఇస్తామని బెంచ్ చెప్పగా.. మరింత సమయం కావాలని కేంద్రం కోరింది. దీంతో కేసులో మధ్యంతర ఉత్తర్వులను ఆఖరి నిమిషంలో విరమించుకున్న బెంచ్ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

హిందూ ట్రస్టుల్లో ముస్లింలను అనుమతిస్తరా? 
వక్ఫ్​సవరణ చట్టంపై విచారణ సందర్భంగా హిందూ ఎండోమెంట్ ట్రస్టుల అంశాన్ని కూడా సుప్రీం బెంచ్ ప్రస్తావించింది. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యులు ఉండాలన్న నిబంధనను కొత్త చట్టంలో చేర్చారని.. అలాగే హిందూ మత ట్రస్టుల్లో ముస్లిం సభ్యులనూ అనుమతిస్తారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వక్ఫ్ సవరణ చట్టంపై నిరసనల్లో హింస చోటు చేసుకోవడంపై బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా హింసాత్మక ఘటనలు జరగడం కలచివేస్తోందని తెలిపింది. 

గతాన్ని తవ్వి తీయొద్దు.. 
అధికారికంగా వక్ఫ్​బోర్డులకు భూమిని అప్పగించకున్నా.. దీర్ఘకాలంగా వక్ఫ్ అవసరాల కోసం వినియోగిస్తున్న ‘వక్ఫ్​బై యూజర్’ ఆస్తులను డీనోటిఫై చేయడం గందరగోళానికి దారి తీస్తుందని ఈ సందర్భంగా బెంచ్ అభిప్రాయపడింది. ‘‘ఇలాంటి వక్ఫ్​బై యూజర్ ఆస్తులను ఎలా గుర్తిస్తారు? వీటికి డాక్యుమెంట్లు ఎలా ఉంటాయి? వీటిలో కొన్ని చోట్ల ఆస్తులు దుర్వినియోగం అవుతున్న దాఖలాలు ఉన్నాయి. మరోవైపు నిజంగా వక్ఫ్​ అవసరాల కోసం ఉపయోగిస్తున్న ఆస్తులూ ఉన్నాయి. వందల ఏండ్ల కిందట ఒక పబ్లిక్ ట్రస్ట్ డిక్లేర్ చేసిన ఆస్తులను ఇప్పుడు వేరే ఆస్తులని ప్రకటించలేం. మీరు గతాన్ని తిరిగి రాయొద్దు” అని కోర్టు పేర్కొంది.

భాషకు మతానికి సంబంధం లేదు: సుప్రీంకోర్టు
భాషకు మతానికి సంబంధంలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మహారాష్ట్రలోని ఓ మున్సిపాలిటీ సైన్‌‌ బోర్డ్‌‌లో ఉర్దూ వాడడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌‌ను తోసిపుచ్చింది. ఉర్దూ మన దేశంలోనే పుట్టిందని చెప్పింది. మున్సిపల్ కౌన్సిల్ నేమ్ బోర్డులో మరాఠీతో పాటు ఉర్దూను ఉపయోగించడా న్ని సవాలు చేస్తూ మహారాష్ట్రలోని అకోలా జిల్లా పాతూర్ మాజీ కౌన్సిలర్ వర్షతాయి సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు.

దీనిని జడ్జీలు జస్టిస్​ సుధాంశు ధులియా, జస్టిస్​ కె వినోద్ చంద్రన్​తో కూడిన బెంచ్​ బుధవారం విచారించిం ది. ఈ సందర్భంగా "భాష మతం కాదు" అని బెంచ్ పేర్కొంది. "భాష అనేది సంస్కృతి. ఒక సమాజం. నాగరికత పురోగతిని కొలవడానికి ఒక కొలమానం. ఉర్దూ విషయంలోనూ అంతే. మున్సిపల్ కౌన్సిల్ చేయాల్సిం దల్లా సమర్థవంతమైన కమ్యూనికేషన్‌‌ రూపొందించడమే"అని కోర్టు పేర్కొంది.