రేపటి నుంచి ఏం చేయాలి?..  రూ.2 వేల నోట్ల డిపాజిట్కు నేడే(సెప్టెంబర్ 30) ఆఖరు

న్యూఢిల్లీ : రూ. 2,000 కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఆర్​బీఐ ఇచ్చిన గడువు నేటితో (సెప్టెంబర్ 30, 2023న).. అంటే  శనివారంతో ముగుస్తున్నది. మీ వద్ద ఇంకా రూ. 2,000 నోట్లు ఉంటే  వాటిని డిపాజిట్ చేసి మార్చుకోకపోతే, ఈ గడువులోపే  చేయండి. ఎందుకంటే, సెప్టెంబరు 30 తరువాత రూ. 2,000 నోట్లతో మీరు ఏమి చేయవచ్చనే విషయమై   ఆర్​బీఐ నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. అయితే ఇక నుంచి కూడా ఈ నోట్లు చెలామణిలో ఉంటాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్​బీఐ) ఇది వరకే ప్రకటించింది. అంటే రేపటి నుంచి కూడా రూ. 2,000 నోటు చట్టబద్ధమైన కరెన్సీగా కొనసాగుతుంది.

2000  రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఆర్‌‌బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ "సెప్టెంబర్ 30 తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై నేను మీకు ఊహాజనిత సమాధానం ఇవ్వలేను. చట్టబద్ధమైన  టెండర్  స్థితి  సెప్టెంబర్ 30 వరకు మాత్రమే కొనసాగుతుందని మేం చెప్పడం లేదు.   అన్ని నోట్లూ డిపాజిట్​ చేయించాలనే ఉద్దేశంతోనే సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చాం. ఇలా చేయకుంటే అన్ని నోట్లు వెనక్కి రావడం కష్టమవుతుంది”అని వివరించారు. దాస్​ ప్రకటనను గమనిస్తే రూ.2 వేల నోటు ఇక నుంచి కూడా లీగల్​ టెండర్​గా కొనసాగుతుందని అర్థం. ఒక రిపోర్టు ప్రకారం రూ.2,400 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ వెనక్కి రాలేదు. మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు డిపాజిట్​ అయ్యాయి. 

ALSO READ: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్

గడువును పెంచుతుందా ?

ఆర్​బీఐ ఈ నెల ఒకటో తేదీన చేసిన ప్రకటన ప్రకారం చెలామణిలో ఉన్న 93 శాతం రూ. రెండు  వేల నోట్లు వెనక్కి వచ్చాయి. ఈ నోట్లను ఉపసంహరించుకున్నట్టు ఈ ఏడాది మే 19న ప్రకటించింది. ఇంకా ఏడు శాతం నోట్లు మాత్రమే వెనక్కి రాలేదు కాబట్టి గడువును పెంచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని బ్యాంకింగ్​ రంగ నిపుణులు అంటున్నారు. ఈ వాదనతో సీనియర్​ ఆఫీసర్​ ఒకరు విభేదిస్తూ మరో నెల వరకు గడువును పెంచవచ్చని చెప్పారు. నోట్లను మార్చుకోని వాళ్లు లేదా ఖర్చు చేయని వాళ్లు వాటిని ఇప్పుడు ఏం చేయాలి ? ఆర్​బీఐ ప్రకటన ప్రకారం.. ఇవి ఇక నుంచి కూడా లీగల్​ టెండర్​గా ఉంటాయి కాబట్టి మార్చుకోవడానికి ఆర్​బీఐ ఏదో ఒక మార్గం చూపాలని నిపుణులు అంటున్నారు.  

ఇక ముందు కూడా కేవైసీ ఉన్న బ్యాంకు ఖాతాల్లో రూ. రెండు వేల నోట్లను డిపాజిట్​ చేయడానికి అనుమతులు ఇవ్వొచ్చు. దుకాణదారులు లేదా వ్యాపార సంస్థలు ఇప్పుడు రూ.రెండు వేల నోటును తీసుకోవడం లేదు కాబట్టి ఆర్​బీఐ కనీసం తన ఆఫీసుల్లో అయినా నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వొచ్చు. అయితే ఇందుకోసం గుర్తింపు కార్డులనో, ఐడీ కార్డులనో ఇవ్వాల్సి రావొచ్చు. నోట్ల మార్పిడి కోసం ఆర్​బీఐ దేశవ్యాప్తంగా తన 19 రీజనల్​ ఆఫీసుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే నోట్ల మార్పిడికి కొన్ని బ్యాంకులు ఐడీ ప్రూఫ్​లను అడగ్గా, మిగతావి అడగలేదు. ఇక నుంచి మాత్రం ఆర్​బీఐ కేవైసీ కోసం పట్టుబట్టవచ్చని నిపుణులు అంటున్నారు.