యాదాద్రి, వెలుగు: గొర్రెల పంపిణీపై యాదాద్రి కలెక్టరేట్ లో నిర్వహించిన రివ్యూలో స్పెషలాఫీసర్లు, మండల ఆఫీసర్ల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. రూ.7,500లకు 20 కిలోల బరువున్న గొర్రె వస్తుందా.?! అని ఆఫీసర్లు ఒకరికొకరు ముచ్చటించుకున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీపై శనివారం యాదాద్రి కలెక్టరేట్లో స్పెషలాఫీసర్లతో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ స్పెషలాఫీసర్ లేచి.. ‘ఎన్ని కిలోల బరువున్న గొర్రెలను కాపరులను కొనుగోలు చేయాలి’ అని ప్రశ్నించారు.
దీంతో జిల్లా వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఒక్కో గొర్రె 20 కిలోలకు పైగా బరువుండాలి. అలా 20 గొర్రెలు, ఒక పొట్టేలును కాపరులకు కొనివ్వాలి’ అని చెప్పారు. దీంతో రివ్యూ మీటింగ్‌లో స్పెషలాఫీసర్ల మధ్య ఒక్కసారి గుసగుసలు మొదలయ్యాయి. ‘‘మార్కెట్లో కిలో మటన్ రూ.700కు పైగా ఉన్నదని, రూ. 7,500కు 20 కిలోలకు పైగా బరువున్న గొర్రెను ఎలా వస్తుంది” అని ప్రశ్నించుకోవడం కన్పించింది. కాగా, రెండో విడత గొర్రెల పంపిణీ స్కీంలో యాదాద్రి జిల్లాకు 15,390 లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నారు.
మొదటి విడత పంపిణీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈసారి మండలానికో స్పెషలాఫీసర్ ను నియమించడంతో పాటు టీంను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ జీవో జారీ చేశారు. ఈ టీంలో తహసీల్దార్, ఎంపీడీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ను మెంబర్లుగా నియమించారు. గొర్రెల పంపిణీ స్కీంపై కాపరులకు అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. గొర్రెల ట్రాన్స్‌పోర్టు కోసం ఆహ్వానించిన సీల్ టెండర్లను 18న ఓపెన్ చేయాలని ఆదేశించారు.