డబ్బులు, మద్యం పంచలేదని .. భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేస్తవా ? : మంత్రి గంగుల

  • అడ్డంగా దొరికిపోయి రివర్స్​ డ్రామాలాడుతున్నడు
  • కెమెరాల్లో అంతా రికార్డయ్యింది

కరీంనగర్ :  కరీంనగర్​ జిల్లా కొత్తపల్లిలో మంగళవారం రాత్రి కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ డబ్బులు  పంపిణీ చేస్తుంటే తమ పార్టీ వాళ్లు పట్టుకున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. బండి సంజయ్ డబ్బులు పంచడం సీసీ ఫుటేజీలో క్లియర్ గా కనిపించిందని, అడ్డంగా దొరికిపోవడమేగాక అడ్డుకున్న తమ పార్టీ కార్యకర్తలను డబ్బులు పంచుతున్నారంటూ రివర్స్ డ్రామా స్టార్ట్ చేశారని మండిపడ్డారు. డబ్బులు, మద్యం పంచలేదని భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేస్తావా అంటూ సంజయ్ కి సవాల్ విసిరారు. కరీంనగర్ లోని తన ఇంట్లో మాట్లాడుతూ ‘మేం డబ్బులు పంచుతున్నామని ఆరోపిస్తున్న సంజయ్ మొదట పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? సంజయ్ చూపెట్టిన ఓటర్ లిస్ట్ వారి కారులోనే దొరికింది’ అని అన్నారు.

నిజంగా తమ పార్టీ కార్యకర్త దగ్గర డబ్బులు దొరికితే ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. తాను లక్ష సెల్ ఫోన్లు పంచుతున్నట్లు ప్రచారం చేసిన సంజయ్.. అవి ఎక్కడ ఉన్నాయో ఒక్కటైనా చూపించాలని సవాల్ విసిరారు. కరీంనగర్ లో సంజయ్ అకృత్యాలతో ప్రజలు విసిగిపోయారని, ఆయనకు ఓటమి తప్పదన్నారు. ఈ సందర్భంగా సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ కార్యకర్త ను బీజేపీ నాయకులు దుర్భాషలాడుతున్న వీడియోను, ఈ ఘటనకు ముందు కొత్తపల్లిలోని ఓ ఏరియాలో జనంతో సంజయ్ మాట్లాడుతున్న సీసీ టీవీ ఫుటేజీని మంత్రి రిలీజ్ చేశారు.