వరల్డ్ కప్ లో సెమీస్ సమరానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. భారత్, న్యూజిలాండ్ తలపడతున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ రేపు(నవంబర్ 15) జరగనుంది. ఆడిన 9 మ్యాచ్ ల్లో గెలిచి భారత్ ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించిన న్యూజిలాండ్ కష్టంగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. అయితే ఎన్ని మ్యాచ్ లు గెలిచినా రేపు బాగా ఆడిన వాళ్లదే విజయం అని న్యూజీలాండ్ కెప్టెన్ విలియంసన్ తెలియజేశాడు.
సెమీ ఫైనల్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్సు తో మాట్లాడిన విలియంసన్.. " భారత్ చాలా బాగా ఆడుతుంది. వారిని ఓడించడం మా ముందున్న అతి పెద్ద సవాలు. ఈ మ్యాచ్ పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. 2019 వరల్డ్ కప్ లో భారత్ పై సెమీస్ ఆడాం. కానీ ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నాయి. మమ్మల్ని అండర్ డాగ్స్ గా పిలిచినా ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించట్లేదు. మధ్యలో కొన్ని మ్యాచ్ లు ఓడిపోయినా చివరికి పుంజుకొని సెమీస్ లో అడుగుపెట్టాం. రేపు ఎవరు బెస్ట్ క్రికెట్ ఆడితే ఆ జట్టు ఫైనల్ కు వెళ్తుంది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాం". అని కివీస్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
2019 వన్డే వరల్డ్ కప్ లో సైతం భారత్ తొలి స్థానంలో నిలిస్తే న్యూజిలాండ్ నాలుగో స్థానంతో సెమీస్ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో అప్పట్లో టీమిండియా జోరు చూస్తుంటే ఈజీగా గెలుస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ భారత్ కు ఊహించని షాక్ ఇచ్చి కివీస్ 18 పరుగుల తేడాతో గెలిచింది. నాలుగేళ్ళ తర్వాత మరోసారి ఇదే సీన్ రిపీట్ కావడంతో ఈ సారి భారత్ ను న్యూజీలాండ్ ఓడిస్తుందేమోనని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే సొంతగడ్డపై భారత్ జోరు చూస్తుంటే ఈ సారి కివీస్ చిత్తవడం ఖాయంగా కనిపిస్తుంది.