చర్చకు మేం సిద్ధం: భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

చర్చకు మేం సిద్ధం: భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల ఓటింగ్ శాతాన్ని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలనే డిమాండ్‎పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోపు పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల ఓటింగ్ శాతం డేటాను తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేలా ఈసీని ఆదేశించాలని 2019లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పిటిషన్లు దాఖలు చేశాయి. 

ఈ రెండు పిటిషన్లపై మంగళవారం (మార్చి 18) చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ  చేపట్టింది. పోల్ ప్యానెల్ తరపున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. ఈ ఫిర్యాదును చర్చించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సమావేశమయ్యారని.. పిటిషనర్లు ఆయనను కలిసి వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ధర్మాసనానికి తెలిపారు. 

ALSO READ | తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే : ఎంపీ లక్ష్మణ్

పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల ఓటింగ్ శాతాన్ని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలనే డిమాండ్‌పై చర్చించడానికి ఈసీ సిద్ధంగా ఉందన్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల ఓటింగ్ శాతాన్ని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలనే డిమాండ్‌పై చర్చించడానికి సిద్ధంగా ఉందన్న ఈసీ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. 10 రోజుల్లోగా పోల్ ప్యానెల్ ముందు తమ అభిప్రాయాలను తెలియజేయాలని పిటిషనర్లకు సూచించింది. అనంతరం ఈ పిటిషన్ల తదుపరి విచారణను 2025, జూలై 28కి వాయిదా వేసింది.