క్రికెట్ పోటీలు ప్రారంభం
దేవరకొండ/కోదాడ/రాజాపేట, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం దేవరకొండ, అనంతగిరిలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. దేవరకొండ పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన పోటీలను ఎమ్మెల్యే రవీంద్రకుమార్, అనంతగిరి అనురాగ్ కాలేజీలో జరిగిన పోటీలను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రారంభించారు. దేవరకొండలో డీఎస్పీ నాగేశ్వర్‌రావు, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, అనంతగిరిలో కోదాడ ఆర్డీవో కిశోర్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే యాదాద్రి జిల్లా రాజాపేట జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన మండల స్థాయి పోటీలను ఎంపీపీ గోపగాని బాలమణి ప్రారంభించారు.
గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
సూర్యాపేట/యాదాద్రి/నల్గొండ అర్బన్, వెలుగు : క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూచించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ కప్ పోటీల ముగింపు కార్యక్రమాన్ని గురువారం పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ పి.అన్నపూర్ణ హాజరై గెలిచిన వారికి ప్రైజ్‌లు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చదవుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాజేంద్రకుమార్, ఆఫీసర్లు యాదయ్య, విజయలక్ష్మి, అశోక్, డీఎస్పీ నాగభూషణం, కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. అలాగే నల్గొండలో నిర్వహించిన పోటీల్లో గెలిచిన వారికి మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరిలో కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు.
ఆక్రమణదారులను ఖాళీ చేయించిన ఆఫీసర్లు
హుజూర్‌నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణ శివారులోని ఇందిరమ్మ ఇండ్లను ఆక్రమించుకున్న వ్యక్తులను ఆఫీసర్లు ఖాళీ చేయించారు. తహసీల్దార్ వజ్రాల జయశ్రీతో పాటు పోలీస్, మున్సిపల్ ఆఫీసర్లు గురువారం ఇండ్ల వద్దకు వెళ్లారు. ప్రభుత్వం పంపిణీ చేయకముందే ఇండ్లను ఆక్రమించుకోవడం సరికాదని, వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో ఆక్రమణదారులు ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. వారిని ప్రైవేట్ వెహికల్స్‌లో ఎక్కించి వేరే ప్రాంతానికి తరలించారు. అనంతరం తహసీల్దార్ జయశ్రీ, ఎస్సై వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి ఇండ్లు మంజూరు చేస్తుందని, అప్పటివరకు ఎవరు ఆక్రమించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వెంటనే ఇండ్లు మంజూరు చేయాలి
నేషనల్ హైవే, రింగ్ రోడ్డు నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన వారిని వెంటనే డబుల్ ఇండ్లు కేటాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శీతల రోశపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్వాసితులతో కలిసి గురువారం ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ టైంలో రెండు నెలల్లోనే ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోవడం లేదన్నారు. తాత్కాలికంగా ఇందిరమ్మ ఇండ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించడం సరికాదన్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎలక సోమయ్యగౌడ్, ఉపతల వెంకన్న, నందిపాటి సైదులు, చల్లా జయకృష్ణ, గీత, రహీం, అలీం, మేరీ, మంగమ్మ పాల్గొన్నారు.
యాదాద్రి జడ్పీ మీటింగ్ నిరవధిక వాయిదా
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జడ్పీ మీటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. బుధవారం మీటింగ్ జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో గురువారం ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ రోజు కూడా 11.10 వరకు కొందరు ఆఫీసర్లు వచ్చినా సభ్యులెవరూ రాలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కె.నగేశ్, వలిగొండ జడ్పీటీసీ వాకిటి పద్మ వచ్చారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల జడ్పీఆఫీస్‌కు వచ్చినా మీటింగ్ హాల్‌లోకి రాలేదు. 11.30 గంటల వరకు జడ్పీ చైర్మన్ సహా మిగతా సభ్యులెవరూ మీటింగ్‌కు రాకపోవడంతో కోరం లేనందున మీటింగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి ప్రకటించారు. మునుగోడు ఎఫెక్ట్‌తో పాటు, స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుగుతున్నందునే మీటింగ్‌కు సభ్యులెవరూ రాలేదని పలువురు అనుకుంటున్నారు.
కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి
చౌటుప్పల్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సూచించారు. గురువారం చౌటుప్పల్ మండలం ఎల్లారెడ్డిగూడెంలో జరిగిన ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాణిరుద్రమతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతుందన్నారు. రాజగోపాల్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని సూచించారు.
బీజేపీ మీటింగ్‌కు భారీ సంఖ్యలో తరలిరావాలి
యాదాద్రి/నల్గొండ అర్బన్/చండూరు/చౌటుప్పల్/హుజూర్‌నగర్, వెలుగు : ఈ నెల 21న మునుగోడులో నిర్వహించనున్న బీజేపీ మీటింగ్‌కు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి, నల్గొండలో జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడారు. ప్రతి బూత్ నుంచి కనీసం వెయ్యి మందిని తరలించాలని సూచించారు. భువనగిరి మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి, దాసరి మల్లేశం, వేముల అశోక్, కర్నాటి ధనుంజయ, నల్గొండలో రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రసాద్, గార్లపాటి జితేందర్, పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే చౌటుప్పల్‌లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, హుజూర్‌నగర్‌లో బీజేపీ లీడర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. చండూరులో ఏర్పాటు చేసిన మీటింగ్‌కు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్‌రెడ్డి హాజరయ్యారు.
నారసింహుడిని దర్శించుకున్న ఉత్తమ్ దంపతులు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామిని గురువారం నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి దర్శించుకున్నారు. వారికి అర్చకులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకి గర్భాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానార్చకుడు నల్లంథీగళ్ లక్ష్మీనర్సింహాచార్యులు వేదాశీర్వచనం చేయగా, సూపరింటెండెంట్ రాజు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు ఆయనకు ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు.
కాంగ్రెస్‌తోనే మునుగోడు అభివృద్ధి
మునుగోడు, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ హయాంలో చేసిన పనులే కనిపిస్తున్నాయని, ఎనిమిదిన్నరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేం లేదని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని పీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో దామోదర్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి జీవనాడి అని, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పార్టీని వీడినంత మాత్రాన కార్యకర్తలు అధైర్య పడొద్దన్నారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెబుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని సవాల్‌చేశారు. పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు, టీపీసీసీ అధికార ప్రతినిధి పున కైలాస నేత పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
యాదాద్రి, వెలుగు : గ్రామాలు అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేశారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి సహా జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలంటూ జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కె.నగేశ్‌తో పాటు పలువురు జడ్పీటీసీలు గురువారం జడ్పీ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా జిల్లాలో అభివృద్ధి మాత్రం జరగడం లేదన్నారు.
గంధమల్ల రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. మూసీ ప్రక్షాళనతో పాటు బునాదిగాని కాల్వ, సాగునీటి వనరుల కల్పన పనులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రిజైన్ చేయడం వల్లే అక్కడ రూ. 220 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేస్తే ఇక్కడ కూడా అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు నరేందర్‌గుప్తా, వాకిటి పద్మ పాల్గొన్నారు.