T20 World Cup 2024: మంచిగా ఆడండి.. ట్రోఫీని అతనికి బహుమతిగా ఇవ్వండి: వీరేంద్ర సెహ్వాగ్

T20 World Cup 2024: మంచిగా ఆడండి.. ట్రోఫీని అతనికి బహుమతిగా ఇవ్వండి: వీరేంద్ర సెహ్వాగ్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం (జూన్ 27) భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ జరగనుంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కీలక పోరులో రోహిత్ సేన విజయం సాధించడంతో.. ఫైనల్లో సఫారీ(దక్షణాఫ్రికా) జట్టును చిత్తు చేయాలని భారత  ఆటగాళ్లకు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించారు.

11 ఏళ్లుగా నిరీక్షణ

భారత జట్టు చివరిసారి 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఆనాటినుంచి గత 11 ఏళ్లుగా మరో ట్రోఫీ కోసం వేచి చూస్తోంది. ఇప్పుడు అలాంటి సదవకాశం రోహిత్ సేన ముందుంది. ఆ కరువును అంతం చేయాలని, ట్రోఫీ గెలిచి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ప్రత్యేక బహుమతిని అందజేయాలని భారత ఆటగాళ్లకు సెహ్వగ్ సూచించారు. 2011లో తాము మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ కోసం చేసిన విధంగానే, ఇప్పటి క్రికెటర్లు తమ కోచ్‌ కోసం 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలవాలని సెహ్వాగ్ అన్నారు.

"మేము 2011 ప్రపంచ కప్ సచిన్ టెండూల్కర్ కోసం ఆడాం. ఈ టీ20 ప్రపంచ కప్ రాహుల్ ద్రవిడ్ కోసం కావచ్చు. కనీసం కోచ్‌గా, అతను ప్రపంచ కప్‌ను గెలుచుకుంటాడు. ప్రపంచ కప్ విజేత అనే బ్యాడ్జ్‌ పొందుతాడు.." అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో చెప్పుకొచ్చాడు. 

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మెరుపులను ఉద్దేశిస్తూ.. "ఈ ప్రపంచకప్‌లో ఇంతకంటే మంచి వినోదాన్ని నేను ఎన్నడూ చూడలేదు. అతను మొదటి ఆరు ఓవర్లు మాత్రమే క్రీజులో ఉంటాడని నేను ఊహించాను. కానీ అతను పవర్‌ప్లే తర్వాత కూడా బ్యాటింగ్ చేశాడు. భారత క్రికెట్ అభిమానుల హృదయాలను సంతోషపరిచాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి?" సెహ్వాగ్ మాట్లాడారు.

ఫైనల్లో సఫారీ జట్టు

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024లో దక్షిణాఫ్రికా ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ట్రినిడాడ్‌ వేదికగా గురువారం ఉదయం ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మర్క్‌రమ్ సేన అలవోకగా విజయం సాధించింది. మొదట ఆఫ్ఘన్ జట్టును 56 పరుగులకే కట్టడి చేసి.. అనంతరం లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే చేధించింది.