రాలిన వడ్లు.. తడిసిన ధాన్యం
కూలిన గోడలు.. ఎగిరిపోయిన ఇండ్ల పై కప్పులు
రెండు వారాల్లో రెండోసారి.. ఇబ్బందుల్లో రైతులు, ప్రజలు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో మరోసారి గాలి, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం నుంచి ఆయా మండలాల్లో వాన కురిసింది. పలుచోట్ల పంట్లు దెబ్బతిన్నాయి. ఆస్తి నష్టం జరిగింది. గత నెల 18, 19 తేదీల్లోనే కురిసిన వడగండ్ల వాన తీరని నష్టం చేకూర్చింది. ఈ రెండు రోజుల్లో కురిసిన వాన కారణంగా జిల్లాలో వరి, మామిడి ఇతర పంటలు కలిపి ఎనిమిది వేల ఎకరాల్లో పంట నష్టం కలిగింది. 3755 మంది రైతులు నష్టపోయారు. దీని నుంచి తెరుకోకముందే మంగళవారం మళ్లీ అకాలవర్షం నిండా ముంచింది. ఒక్కోచోట ఒక్కో విధంగా పడింది. జిల్లాలోని మోత్కూరు, ఆలేరు, భువనగిరి, ఆత్మకూర్ (ఎం) మండలాల్లో భారీ గాలులతో కూడిన వాన కురవగా, రాజాపేట, యాదగిరిగుట్ట మండలంలో వడగండ్ల వాన పడింది.
రాజాపేట మండలంలో వరి చేన్లు నేలకు ఒరగకున్నా గింజలన్నీ రాలిపోయి గడ్డి మాత్రమే మిగిలింది. యాదగిరిగుట్టలోనూ వడగండ్ల వాన కురిసింది. మోత్కూర్, ఆత్మకూర్ (ఎం) మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురవడంతో పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగింది. మోత్కూర్లో కరెంట్ పోళ్లు, ట్రాన్స్ఫార్మర్లు ఒరిగిపోయి. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రేకుల ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. ఇండ్లలోని వస్తువులు తడిచిపోయాయి. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఓ ప్రైవేట్ స్కూల్ ప్రహరీ కూలిపోయింది. ఆ సమయంలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆత్మకూర్ (ఎం) మండలం పారుపల్లిలో ఆత్మకూరు(ఎం) పారుపల్లిలో ఫౌల్ట్రీ ఫారాలు కూలిపోయాయి. కోళ్లు చనిపోయాయి. దీంతో నలుగురు రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అడ్డగూడురులో పంట కల్లాల్లో వడ్ల కుప్పలు తడిసి ముద్దాయ్యాయి. కొంత మేర ధాన్యం వాన నీటిలో కొట్టుకుపోయింది. ఆలేరు, భువనగిరి మండలాల్లోనూ వర్షం ప్రభావం ఉంది.
ఆగిన వెహికల్స్
భువనగిరి, యాదగిరిగుట్ట మండలాల్లో పెనుగాలులుతో కూడిన వాన కారణంగా రోడ్డు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో భువనగిరి, రాయగిరి, వంగపల్లి, ఆలేరు మీదుగా జాతీయ రహదారిపై వెళ్లే వెహికల్స్ నిలిపి వేశారు.
బాధితుడికి ఆర్థిక సాయం
చండూరు/హాలియా/తుంగతుర్తి, వెలుగు: ఈదురుగాలులతో నల్గొండ జిల్లా చండూరు మున్సిపా లిటీలోని రాజీవ్ కాలనీలో చేనేత కార్మికుడైన తిరందాసు వెంకటేశం ఇంటి పైకప్పు పూర్తిగా లేచిపోయింది. ఇంటిలో సామగ్రి దెబ్బతిన్నది. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.25వేల ఆర్థిక సాయం అందజేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది.