
- టెస్ట్ టీమ్ బ్యాకప్ కీపర్
- రేసులో ఆంధ్ర క్రికెటర్
- విండీస్ టూర్‌కు నేడు టీమ్ సెలెక్షన్
ముంబై: వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే ఇండియా టెస్ట్ జట్టులో ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎస్ భరత్‌కు చాన్స్ దొరికే అవకాశం కనిపిస్తోంది. విండీస్ టూర్ నుంచి ధోనీ తప్పుకోవడంతో రిషబ్ పంత్ అన్ని ఫార్మాట్‌ల్లో వికెట్ కీపర్‌గా కొనసాగనున్నాడు. అయితే టెస్టుల్లో పంత్‌కు బ్యాకప్‌గా వృద్ధిమాన్ సాహా పేరు వినిపిస్తున్నప్పటికీ ఆంధ్ర క్రికెటర్ భరత్ కూడా ఇప్పుడు రేస్‌లోకి వచ్చాడు. వికెట్ కీపర్ల బెంచ్ బలాన్ని పెంచుకోవడంపై సెలెక్టర్లు దృష్టి సారించడంతో భరత్ ఎంపికపై ఆశలు రేగాయి. ఫస్ట్ క్లాస్‌తో పాటు ఇండియా–ఎ తరఫున అదిరిపోయే రికార్డు ఉండడంతో వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే ఇండియా జట్ల ఎంపిక కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం జరిగే సెలెక్షన్ కమిటీ మీటింగ్‌లో భరత్ పేరు చర్చకు రానుంది. గత 12 నెలల్లో ఇండియా–ఎ తరఫున 11 అనధికార టెస్టులు ( వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లండ్ లయన్స్– ఎ జట్లతో) ఆడిన భరత్ 686 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. కీపర్‌గా 41 క్యాచులందుకున్న భరత్, ఆరు స్టంపింగ్స్ కూడా చేశాడు. మరో పక్క 34 ఏళ్ల సాహా 2018లో చివరిసారిగా ఇండియా తరఫున టెస్ట్ ఆడాడు. గాయం కారణంగా అప్పట్లో జట్టుకు దూరమైన సాహా.. ఐపీఎల్, ముస్తాక్ అలీ టోర్నీలో సత్తా చాటి మళ్లీ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. కాగా, ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే ఈ సిరీస్‌లో వెస్టిండీస్‌తో ఇండియా వరుసగా మూడు టీ 20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది.