ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విండోస్ 11 అప్డేట్ రానేవచ్చింది. కొత్త లుక్కుతో సాఫ్ట్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. 2015లో విండోస్ 10 రిలీజైన తర్వాత అదే ఆఖరు అప్డేట్ అనుకున్నారు. దానికి తోడు మైక్రోసాఫ్ట్ నుంచి ఐదేండ్లుగా ఓఎస్ అప్డేట్ లేదు. తాజాగా మూడు నెలల క్రితం విండోస్ 11 రిలీజ్ చేస్తున్నట్టు చెప్పి, ఇప్పుడు అప్డేట్ చేసింది.
విండోస్ 11లో ఫీచర్లు బాగున్నాయి. యూజర్ ఇంటర్ఫేస్. పెర్ఫార్మెన్స్లో కూడా అప్డేట్స్ జరిగాయి. ముఖ్యంగా ఈ వెర్షన్ ఆపరేటర్ ఫ్రెండ్లీగా ఉంది. మ్యాక్‌ను పోలిన డిజైన్, సాఫ్ట్ అండ్ స్మూత్ ఆపరేటింగ్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.
ఈ ఫీచర్లు బాగున్నాయి
- విండోస్ 11 డిజైన్ చాలా క్లీన్‌గా ఉంది. ఐకాన్స్‌లో సాఫ్ట్ కార్నర్ డిజైన్, పేస్టల్ షేడ్ మంచి ఫీల్ ఇస్తున్నాయి. పనికి తగ్గట్టు డెస్క్‌టాప్ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎక్స్ట్రా టూల్స్, లే అవుట్స్ కొత్తగా యాడ్ అయ్యాయి.
- ఇప్పటి వరకూ అన్ని ఓఎస్‌లలో స్టార్ట్ మెను ఎడమవైపు ఉండేది. కానీ ఇందులో అది మధ్యలోకి మారింది. దీంతోపాటు టాస్క్‌బార్ కూడా సెంటర్‌కు వచ్చింది.
- ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్ కూడా రన్ చేయొచ్చని మైక్రోసాఫ్ట్ చెప్పింది. అయితే ఈ ఫీచర్ కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ యాప్స్‌ని అమెజాన్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
- విడ్జెట్స్ వాడటానికి ఈ వెర్షన్లో కొన్ని మార్పులు చేశారు. డీఫాల్ట్ విడ్జెట్స్ కాకుండా టాస్క్‌బార్ నుంచి వాటిని యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఏ అప్లికేషన్‌ను అయినా విడ్జెట్స్గా మార్చి వాడుకోవచ్చు.
- మైక్రోసాఫ్ట్ ‘టీమ్స్’ అప్లికేషన్ ఇందులో టాస్క్బార్లోకి వచ్చింది. ఈ అప్లికేషన్ ద్వారా మల్టిపుల్ విండోస్‌లో టీమ్ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కాల్స్, మెసేజెస్, వీడియో చాట్ చేయొచ్చు.
- గేమింగ్ పర్ఫార్మెన్స్లో మంచి మార్పులు జరిగాయి. హెచ్డీఆర్ గేమ్స్‌ను ఆడటానికి అనుకూలమైన అప్డేట్లు వచ్చాయి.
- ‘స్నాప్ గ్రూప్, స్నాప్ లే అవుట్స్’ అనే ఫీచర్ ఉంది. ఇది కంప్యూటర్లోని యాప్స్ అన్నిటినీ ఒక దగ్గరకు తీసుకురావడానికి, అవసరమైన
- లే అవుట్స్‌లో వాటిని పెట్టడానికి పనికొస్తుంది.
అప్డేట్ ఇలా?
- రీసెంట్ కంప్యూటర్లో విండోస్ 10 ఉంటే విండోస్11కు అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.
- ముందుగా పీసీ విండోస్11 కొత్త వెర్షన్‌ను సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేయాలి. అందుకు మైక్రోసాఫ్ట్ పీసీ హెల్త్ చెక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. అది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. దాన్ని ఇన్స్టాల్ చేసి రన్ చేశాక, పీసీ కంఫర్టబుల్‌గా ఉందా లేదా అనేది చూపిస్తుంది.
- కంఫర్టబుల్ అనే మెసేజ్ వస్తే.. విండోస్ 11 కి మార్చుకోవడం చాలా ఈజీ.
- కంప్యూటర్ సెట్టింగ్స్ కి వెళ్లాలి. అక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేసి.. పెండింగ్ అప్డేట్లు అన్నీ పూర్తి చేయాలి.
- ఆ తర్వాత ‘చెక్ ఫర్ అప్డేట్స్’ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు విండోస్11 అప్డేట్ కనిపిస్తుంది.
- అప్డేట్ మీద క్లిక్ చేయగానే విండోస్11 ఇన్స్టాల్ అవుతుంది. అంతా పూర్తయ్యాక సిస్టమ్ రిస్టార్ట్ అవుతుంది. ఇప్పటికైతే విండోస్ 11 లో ఎటువంటి బగ్స్ కనిపెట్టలేదు.