వనపర్తి జిల్లాలో గాలి దుమారం.. ఆగమాగం

వనపర్తి జిల్లాలో గాలి దుమారం.. ఆగమాగం

వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, అమ్రాబాద్, పెబ్బేరు, చిన్న చింతకుంట, వెలుగు: వనపర్తి జిల్లాలో ఆదివారం సాయంత్రం గాలి దుమారానికి పలుచోట్ల చెట్లు విరిగి, విద్యుత్​తీగలు రోడ్లపై పడ్డాయి. రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. పామిరెడ్డిపల్లిలో ఈదురుగాలుల ధాటికి పొలంలోని 33/11 కేవీ  కరెంట్ పోల్ విరిగి పడింది. మద్దిగట్ల, అమ్మపల్లి లో మామిడికాయలు రాలాయి. పెద్దమందడి మండలంలోని  పామిరెడ్డి పల్లి, వీరాయపల్లి, దొడగుంటపల్లి, మద్దిగట్ల, అమ్మపల్లి, వెల్టూర్, చిలకటోని పల్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. అచ్చంపేట, బల్మూర్ మండలాల్లో చెట్లు విరిగి, విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

బల్మూరు మండలం గోధల్ లో పిడుగు పడి, వేప చెట్టు విరిగిపోయింది. కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో వర్షం కురిసింది. 35 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసినట్లు వెల్దండ మండలం తిమ్మినోన్​పల్లికి చెందిన గండి కోట శ్రీను తెలిపాడు.  అమ్రబాద్ మండలంలోని చింతలోనిపల్లిలో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. సాయిలమ్మ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.  పెబ్బేరు పట్టణంలోని పాత చెక్​పోస్టు వద్ద  చెట్టు విరిగి, విద్యుత్​ తీగలపై పడటంతో స్తంభం నేలకొరిగింది.  చిన్నచింతకుంట మండలంలోని అమ్మపురం, అల్లిపూర్ గ్రామాల్లో వడ్లు తడిసిపోయాయి. 

కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులోని వేలాది బస్తాల మొక్కజొన్న ధాన్యం తడిసింది. బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి, మహాదేవుని పేటలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మహాదేవుని పేట శివారులోని రెండు కోళ్ల ఫారాలు కూలిపోయాయి . తాడూరు మండలంలోని పర్వతాయపల్లి, పరిసర గ్రామాల్లో మామిడి కాయలు రాలిపోయాయి.  అయిజ, వెలుగు: మల్దకల్ మండలంలోని చిప్పదొడ్డి గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి, రామన్​గౌడ్​కు చెందిన రెండు ఎడ్లు మృతిచెందాయి.  వాటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.