ముంబై: సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో వైన్ అమ్ముకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రను ‘మద్యరాష్ట్ర’ (లిక్కర్ స్టేట్)గా మారుస్తున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. దీనిపై అధికార శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని.. దీని వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. ‘వైన్.. లిక్కర్ కాదు. వైన్ అమ్మకాలు పెరిగితే, దీని వల్ల అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుంది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని రౌత్ పేర్కొన్నారు. బీజేపీ అన్నదాతల కోసం చేసిందేమీ లేదని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇంకేం చేయలేదన్నారు. మల్లికార్జున ఖర్గే చెప్పింది నిజమేనని.. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని ఆరోపించారు.
కాగా, సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్స్ లో వైన్ ను అమ్ముకునే ప్రతిపాదనపై మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం అంగీకారం తెలిపింది. వార్షిక లైసెన్స్ ఫీజు కింద రూ.5 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. వైన్ తయారీ కేంద్రాలకు మార్కెటింగ్ ఛానల్ ను మరింత అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం: