తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల క్రమంలో ఇవాళ (మే 11) సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. పోలింగ్ జరిగే మే 13వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. కల్లు కంపౌండ్‌లు కూడా ఓపెన్ కావు. పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈసీ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీంతో మద్యం ప్రియులు ముందుగానే స్టాక్ తెచ్చిపెట్టుకోవాలని ప్లాన్ లో ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లో 45 మంది, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే .. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387మంది పోటీలో నిలిచారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలహలం నెలకొంది. ఎన్నికల్లో ఓటేసేందుకు తమ తమ నివాసాలకు వెళ్తున్నారు ప్రజలు. దీంతో ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిక్కిరిసాయి. వారం రోజుల పాటు రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. మరికొందరు సొంత వాహనాల్లో ఏపీకి బయల్దేరారు. దీంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వందలాదిగా వాహనాలు బారులు తీరారు.