వైన్స్​లో వేటకొడవళ్లతో బీభత్సం

 వైన్స్​లో వేటకొడవళ్లతో బీభత్సం
  • పాతకక్షలతో యువకుడిపై దాడి
  • త్రుటిలో తప్పించుకున్న బాధితుడు
  • అతడి ఫ్రెండ్స్​కు తీవ్ర గాయాలు 
  • చైతన్యపురిలో ఘటన

దిల్ సుఖ్ నగర్, వెలుగు: వైన్స్​లో కూర్చొని మద్యం తాగుతున్న వారిపై కొందరు పాత కక్షలతో కొబ్బరిబోండాలు నరికే కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. సినిమా సీన్​ను తలపించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పీఎస్​పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్​లోని ఎన్టీఆర్ నగర్​కు చెందిన బొడ్డు మహేశ్, పురుషోత్తం రెండేండ్ల కింద ఓ పెళ్లి బరాత్​లో గొడవ పడ్డారు. ఆ సమయంలో మహేశ్ పై పురుషోత్తం బీర్ బాటిల్ తో దాడి చేశాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉండగా, రాజీ కోసం మహేశ్ డబ్బులు తీసుకున్నాడు. అయితే, శుక్రవారం కోర్టుకు రాకుండా ఉన్న మహేశ్.. సూర్యాపేటలో ఉన్నానని చెప్పి, కోర్టు కానిస్టేబుల్​ను వాయిదా కోరాడు. 

అనంతరం పాత కక్షలను మనసులో పెట్టుకొని, ఎలాగైనా పురుషోత్తంను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. శుక్రవారం సాయంత్రం చైతన్యపురిలోని అమరావతి వైన్స్​లో తన ఫ్రెండ్స్ తో కలిసి పురుషోత్తం మద్యం తాగుతున్నాడని తెలుసుకున్నాడు. అనంతరం తన స్నేహితులైన బెల్లి భరత్, నందనవనం సురేందర్ అలియాస్ సూరి మరో 6 మందితో కలిసి కారు, బైక్​లపై అక్కడి వెళ్లి, కొబ్బరి బోండాలు నరికే కత్తులతో దాడి చేశారు.

 ఈ క్రమంలో పురుషోత్తం తప్పించుకొని పారిపోగా, అతని స్నేహితులైన రాము (28), పాశం నాగరాజు (28)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి రాము పక్కనే ఉన్న ఫైనాన్స్ ఆఫీస్​లోకి వెళ్లి తలదాచుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, చైతన్యపురి సీఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసులో నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.