నస్పూర్, వెలుగు: పోలింగ్ కు ముందు 72 గంటలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ తో కలిసి జిల్లా ఇంటిలిజెన్స్ కమిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ కీలక సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రలోభాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అంతర్రాష్ట్ర, జిల్లా చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 11 సాయంత్రం 4 గంటల నుంచి జిల్లాలోని వైన్ షాపులను మూసి ఉంచాలని స్పష్టం చేశారు. ఫంక్షన్, కమ్యూనిటీ హాళ్లు, ధర్మశాలలు, అతిథి గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. మద్యం, నగదు, బంగారం, కానుకలు ఇతరత్రా ఓటరు ప్రభావిత అంశాల పంపిణీ జరగకుండా పర్యవేక్షించాలని సూచిచారు. కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ, మద్య నిషేధ శాఖ అధికారి నందగోపాల్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, కమర్షియల్ టాక్స్ అధికారి శివ ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.