- నెలకు రూ. 200 కోట్ల మేర సిండికేట్ దందా!
- మందుబాబుల జేబుకు చిల్లుపెడుతున్న లిక్కర్ షాపులు
- రాష్ట్రంలోని వైన్‌షాపులపై రెండు నెలల్లో 450కు పైగా ఫిర్యాదులు
- నిర్లక్ష్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్
- సిండికేట్ల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు : మద్యం వినియోగదారుల జేబులకు చిల్లు పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. లిక్కర్‌కు రేట్లు మారాయంటూ ఏదో చెప్పడం, లేదంటే బ్రాండ్ కొరత పేరుతో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. బీర్ల విషయానికొస్తే కూలింగ్, బ్రాండ్ల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర సర్కారు వరుసగా మద్యం ధరలు పెంచింది. దానికి తోడు వైన్ షాపుల నిర్వాహకులు కూడా మద్యం ప్రియులను దోచుకుంటున్నారు. బీరుపై రూ.10 నుంచి రూ.15 వరకు, లిక్కర్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.30 నుంచి రూ.40 వరకు ఎమ్మార్పీ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్క నెలలో రూ.200 కోట్ల మేర దందా చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే.. బీరు చల్లగా లేదని, అడిగిన బ్రాండ్ తమ వద్ద లేదంటూ మద్యం విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో మందుబాబులు చేసేదేమీ లేక షాపు వాళ్లు ఎంత అడిగితే అంత ఇచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాల్లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు లిక్కర్ అమ్ముతున్నారని గత రెండు నెలల్లోనే రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు 450కు పైగా కంప్లయింట్స్ వచ్చాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదులను పట్టించుకోలేదు. కింది స్థాయిలో వైన్‌షాప్ నిర్వాహకులు ఎక్సైజ్ సిబ్బందిని మేనేజ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
సిండికేట్ గా మారి వసూలు చేస్తున్నరు
వైన్ షాపు నిర్వాహకులు తమ ఇష్టమొచ్చినట్లు ఎంఆర్‌పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగిస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు కిమ్మనడం లేదు. కనీసం అటువైపు చూడడమే లేదు. చాలా చోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంలో ఉండడమే కారణంగా తెలుస్తున్నది. బోనాల పండుగ కూడా కలిసి రావడంతో సిండికేట్‌గా మారి ఈ తతంగం నడిపిస్తున్నట్లు సమాచారం. ఏయే బ్రాండ్లను ఎంత అధికంగా విక్రయించాలి, గ్రామాల్లో నడిచే బెల్టు షాపుల నిర్వాహకులకు ఎంతకు అమ్మాలి అన్నది ప్రతి మండలం, జిల్లాలో వైన్ షాప్ నిర్వాహకులు ముందే డిసైడ్ చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కడకు వెళ్లినా అంతే ధర చెప్పేలా ప్లాన్ చేసుకుని దందా చేస్తున్నారు. ఎవరైనా ఎక్కువ ధర చెబుతున్నారని ప్రశ్నిస్తే.. స్టాక్ లేదు, ఇవ్వం అని బెదిరింపులకు గురిచేసి పంపిస్తున్నారు. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. చాలా దుకాణాల్లోఇలాగే కొనసాగుతున్నదని ఫిర్యాదులు వస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు.. మద్యం సిండికేట్ల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యం ధరలను ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటుకు అమ్మడంపై రెండు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 450కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది.