టేకులపల్లిలో మందు షాపు లూటీ.. రూ. 2 లక్షల విలువైన బాటిల్లు ఎత్తుకెళ్లిన మందు ప్రియులు

  • ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని మద్యం షాపులు లూటీ 
  • అదనంగా రూ.30 తీసుకుంటుండడంతో దోపిడీ
  • మూడు షాపుల్లో రూ.22 లక్షల మద్యం మాయం 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ఘటన  

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని, బెల్ట్​షాపులకు బ్రాండెడ్​మద్యం తరలించి తమకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని మూడు మద్యం దుకాణాలపై బుధవారం స్థానిక ప్రజలు దాడి చేశారు. రూ.22  లక్షల విలువ చేసే మద్యాన్ని ఎత్తుకుపోయారు. స్థానికుల కథనం ప్రకారం...టేకులపల్లి నుంచి బోడు దారిలో నాలుగు వైన్ షాపులు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం సిండికేట్​గా ఏర్పడిన ఈ షాపుల యజమానులు ఎమ్మార్పీ కన్నా రూ. 20 నుంచి రూ.30 ఎక్కువగా తీసుకుంటున్నారు.

 అలాగే బ్రాండెడ్​మద్యం బెల్ట్​షాపులకు సరఫరా చేస్తూ రెగ్యులర్​కస్టమర్లకు అందుబాటులో ఉంచడం లేదు. దీంతో అసహనంతో ఉన్l జనాలు బుధవారం పల్లవి1, పల్లవి 2, క్రాంతి ​వైన్స్​ షాపుపై ఒకేసారి దాడి చేసి రూ. 18 నుంచి రూ. 22 లక్షల మద్యం లూటీ చేశారు. మద్యం  ఎత్తుకెళ్తున్న కొందరు మాట్లాడుతూ మద్యం వ్యాపారులు అన్ని రకాల మద్యాన్ని బెల్ట్ షాపులకే పంపుతున్నారని, దీంతో అక్కడా, ఇక్కడా ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోందని వాపోయారు. వైన్ షాప్ యజమానులను ఎన్నిసార్లు  ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని అందుకే ఎత్తుకెళ్తున్నామని చెప్పారు. 

వీరిలో మహిళలు కూడా ఉండడం విశేషం. సంచులు, టూ వీలర్స్, ఆటోల్లో లిక్కర్​ పట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ కరుణాకర్, టేకులపల్లి సీఐ సురేశ్, బోడు ఎస్ఐ శ్రీకాంత్​ వైన్​షాపులను విజిట్​చేసి జరిగింది తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఓ ప్రజాప్రతినిధి అనుచరులు కావాలనే ఒకేసారి దాడి చేసి మద్యం ఎత్తుకువెళ్లారని, అక్కడే ఉన్న జనాలు ఇదే ఛాన్స్​అనుకుని మిగిలిన మద్యం పట్టుకుపోయారన్న చర్చ నడుస్తోంది.