బీర్లు లేవు.. అడగొద్దు.. బోర్డులు పెడుతున్న వైన్ షాప్స్

బీర్లు లేవు.. అడగొద్దు.. బోర్డులు పెడుతున్న వైన్ షాప్స్

తెలంగాణలో మద్యం ప్రియులకు కష్టకాలం వచ్చింది. వేసవికాలంలో  బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు అసంతృప్తి చెందుతున్నారు.  ఎండలు పెరగడం, ఐపీఎల్, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీర్లకు డిమాండ్  పెరిగింది. డిమాండ్​కు తగిన సప్లై లేకపోవడంతో చాలా చోట్ల వైన్  షాపులలో నో స్టాక్​ బోర్డులు పెడుతున్నారు.  ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మద్యంప్రియులు కోరుతున్నారు. అయితే ఇదే అదనుగా చేసుకుని కొందరు  కొన్ని చోట్ల అధిక ధరలకు అమ్ముతున్నారని వాపోతున్నారు.

ఎండకాలం చల్లని బీరు తాగేందుకు మద్యం ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. దానికి తోడు ఐపీఎల్​ రావడంతో మధ్యాహ్నం నుంచే మ్యాచ్​లు వీక్షిస్తూ బీర్లు సేవిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీలు దాటడంతో బీర్లకు డిమాండ్  పెరుగుతోంది. అయితే వైన్స్​లలో సరిపడా బీర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో నిర్వాహకులు ‘నో స్టాక్’​ బోర్డులు పెడుతున్నారు. స్టాక్​ వచ్చిన రెండు గంటల్లోనే బీర్లన్నీ అమ్ముడుపోతున్నాయి. చల్లగా లేకపోయినా కొనుక్కుని వెళ్తున్నారంటే ఎంత డిమాండ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు.

బీర్లు సరిపడ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ను కలిశారు వైన్స్ షాప్ ఓనర్స్. రోజుకు ఒక్క వైన్స్ లో కనీసం 1200 నుంచి 1500 ల బీర్లు సేల్ చేస్తామని... కానీ తమకు  ఎక్సైజ్  డిపో నుంచి కేవలం 200 నుంచి 240 బీర్లు మాత్రమే పంపుతున్నారని కమిషనర్ కు తెలిపారు.  వైన్స్ల వద్ద కస్టమర్లు బీర్లు కావాలని ఆడుతున్నారని..  కానీ బీర్లు లేక నో స్టాక్ బోర్డ్లు పెడుతున్నామని వివరించారు. 

హైదరాబాద్లో  ఏడాదికి ఒక్కో వైన్స్ షాప్ కు కోటి 10 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు కడుతున్నామని తెలిపారు.  లైసెన్స్ ఫీజు కట్టి కూడా తాము లాస్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  బీర్లు ఎక్కువగా సేల్ అయ్యేది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే,జూన్ నెలలోనే.. కానీ  ఈ టైం లో ఎక్సైజ్ శాఖ సరిపడ సప్లై చేయడం లేదంటూ చెప్పారు. డిమాండ్ ఉన్నప్పుడే  బీర్లను అమ్మలేకపోతున్నామని  కమిషనర్ కు వెల్లడించారు.