![ఈ నెల 8 నుంచి వైన్ షాపులు ఓపెన్?](https://static.v6velugu.com/uploads/2020/05/wineshop.jpg)
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి వైన్ షాపులు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు అన్ని జోన్లలో పలు ఆంక్షలతో షాపులను తెరవాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. కంటెయిన్మెంట్ ఏరియాల్లో మాత్రం మూసే ఉంచనున్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. లిక్కర్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఒకే సమయంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నెల 5న జరిగే కేబినెట్ మీటింగ్ లో లిక్కర్ షాపులు తెరిచే విషయంపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు. వైన్ షాపులను ఓపెన్ చేస్తే.. ఏయే జోన్ల పరిధిలో అనుమతి ఇవ్వాలి, ఏ నిబంధనలు పాటించాలి, సెక్యూరిటీ పరిస్థితి ఏమిటన్న దానిపై చర్చించే అవకాశాలున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉంటయా?
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో లిక్కర్ అమ్మకాలకు అనుమతిస్తారా, లేదా అన్నది తేలలేదు. రాష్ట్రంలో 2,216 వైన్ షాపులు ఉండగా.. అందులో సగం ఈ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ అనుమతి ఇవ్వకపోతే ఆశించిన మేర ఆదాయం రావడం కష్టమని చెప్తున్నారు. లాక్ డౌన్ తో దాదాపు రూ.4,200 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎండాకాలంలో ఆదాయం మరింత ఎక్కువగా ఉండేది. కానీ లాక్ డౌన్ కారణంగా లిక్కర్ అమ్మకాలు పూర్తిగా ఆగిపోయి, రెవెన్యూ తగ్గింది.
సరుకు రెడీ
లిక్కర్ అమ్మకాలకు అనుమతిస్తే వైన్ షాపులకు సరఫరా చేసేందుకు కావాల్సిన సరుకు రెడీగా ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లిక్కర్ డిపోల్లో 20 రోజులకు సరిపడా స్టాక్ ఉందని చెప్తున్నారు. లిక్కర్ విక్రయాలకు అనుమతిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏమేం చర్యలు చేపట్టాలన్న దానిపై శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు సమీక్షించారు.
అన్ని జోన్లలో లిక్కర్ షాపులకు ఓకే: కేంద్రం
న్యూఢిల్లీ: లిక్కర్ అమ్మకాలపై కేంద్ర హోం శాఖ క్లారిటీ ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ లిక్కర్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చని శనివారం స్పష్టం చేసింది. అయితే.. కంటెయిన్మెంట్ ఏరియాల్లో మాత్రం వాటికి ఎలాంటి అనుమతి లేదని పేర్కొంది. రెడ్ జోన్‌లోని మార్కెట్లలో, మాల్స్‌లో ఉండే లిక్కర్ షాపుల్లోనూ లిక్కర్ అమ్మకానికి పర్మిషన్ లేదని తేల్చిచెప్పింది. ఈ జోన్లో కేవలం స్వతంత్రంగా ఉండే లిక్కర్ షాపుల్లోనే అమ్మకాలు సాగించాలని పేర్కొంది. అన్ని లిక్కర్ షాపుల వద్ద కస్టమర్లు తప్పనిసరిగా ఒకరికి ఒకరికి మధ్య ఆరు అడుగుల దూరాన్ని పాటించాలని, షాపుల ముందు ఎప్పుడు కూడా ఐదుగురికి మించి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. లాక్డౌన్ థర్డ్ ఫేజ్ ప్రారంభమయ్యే సోమవారం నుంచి ఈ సడలింపులు అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే.. సడలింపుల అమలుపై స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన హోం శాఖ.. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అనేక సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. అందులో కొన్ని అంశాల్లో గందరగోళం నెలకొనడంతో శనివారం క్లారిటీ ఇచ్చింది.
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో బార్బర్ షాపులకు ఓకే
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో బార్బర్ షాపులు, సెలూన్లను ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రెడ్జోన్లలో మాత్రం వీటికి అనుమతి లేదంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఎస్సెన్షియల్, నాన్ ఎస్సెన్షియల్ ఐటమ్స్ సరఫరా కోసం ఈ–కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌కు అనుమతి ఇస్తున్నామని, రెడ్ జోన్లలో ఎసెన్షియల్ ఐటమ్స్ సరఫరాకు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వివరించింది. అన్ని జోన్లలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ లాంటి పరిస్థితులు అమలులో ఉంటాయని, ఆ టైంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.