- ఉదయం 7 గంటలకే బార్లు, వైన్‌షాప్‌లు ఓపెన్ చేస్తున్న నిర్వాహకులు
- కరీంనగర్ సిటీలో ఇష్టారాజ్యంగా లిక్కర్ అమ్మకాలు
- పట్టించుకోని ఎక్సైజ్, పోలీస్ అధికారులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో బార్లు, వైన్స్ కు వేళాపాళా లేకుండా పోయింది. షాపుల నిర్వాహకులు తెల్లారక ముందే షట్టర్లు ఓపెన్ చేసి మద్యం అమ్ముతున్నారు. అప్పటికే పదుల సంఖ్యలో మద్యం ప్రియులు వచ్చి లిక్కర్ తాగుతున్నారు. గతంలో వైన్స్, బార్స్ టైం అయిపోయాక బ్యాక్ డోర్ నుంచి చాటుగా మద్యం అమ్మేవారు. ఇప్పుడు ఏకంగా మెయిన్ షట్టర్ తెరిచి విచ్ఛలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంతా ఓపెన్‌గా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెల్లారక ముందే షట్టర్లు ఓపెన్..
కరీంనగర్ బస్టాండ్ ఏరియా, అంబేద్కర్ స్టేడియం, ఎల్ఐసీ ఆఫీసు, ముక్రంపుర, జ్యోతి నగర్ ఏరియాతోపాటు నగరవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్‌లు టైమింగ్స్ పాటించడం లేదు. బార్లను 11 గంటల వరకే బంద్ చేయాల్సి ఉండగా అర్ధరాత్రి దాటే వరకు ఓపెన్ గానే ఉంటున్నాయి. తెల్లవారుజామున 6 గంటలకే మళ్లీ తెరుచుకుంటున్నాయి. వైన్స్ షాపులు రాత్రి 10 గంటల వరకు మూసేయాల్సి ఉండగా అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకే తెరుస్తున్నారు.
ఎక్కడపడితే అక్కడ సిట్టింగ్..
వైన్స్ షాపుల వెంట ఉన్న పర్మిట్ రూమ్ లు మద్యం ప్రియులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో చాలా మంది బయట స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మించిన ఫుట్ పాత్ లపై సిట్టింగ్ వేస్తున్నారు. ప్రధానంగా అంబేద్కర్ స్టేడియం, తెలంగాణ చౌక్, బస్టాండ్ ఎదుట, ఆదర్శనగర్ తదితర ఏరియాల్లో ఫుట్ పాత్ మీద కూర్చుని మద్యం తాగుతున్నారు. దీంతో అటువైపుగా మహిళలు, యువతులు నడిచి వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దంటూ పోలీస్ ఉన్నతాధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.