జార్ఖండ్, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 2024లో జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల పోరు మొదలైంది.ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే, అందరూ ఎక్కువగా పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. రాజకీయ చర్చల్లో జార్ఖండ్ కంటే మహారాష్ట్రకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వాస్తవానికి దేశ రాజకీయాల్లో మహారాష్ట్ర పెద్దగానే ప్రభావం చూపుతున్నప్పటికీ, జార్ఖండ్ కూడా కీలకమే. గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌కు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై కీలక ప్రభావం చూపుతాయి. 2000లో బిహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
81 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపీలు
జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రాష్ట్రం 27% గిరిజన జనాభాను కలిగి ఉంది. అందువల్ల గిరిజనులు సాధారణంగా ముఖ్యమంత్రి పదవిని పొందినప్పటికీ వారు జార్ఖండ్‌లో ఆధిపత్యం వహించే స్థాయిలో లేరు. మొదటి ఉక్కు కర్మాగారం 1907లో జార్ఖండ్ ప్రాంతంలోనే ప్రారంభమైంది. నేడు, జార్ఖండ్ 30 కోట్ల టన్నుల బొగ్గు, 1. 7 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. జార్ఖండ్ భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన ఖనిజ రాష్ట్రం. 2000లో బిహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు, బీహార్ తన పన్నుల ఆదాయంలో 80% కోల్పోయింది.
హేమంత్ పాలనకు పరీక్ష
గిరిజన నాయకుడు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు చెందిన హేమంత్ సోరెన్ ప్రస్తుతం కాంగ్రెస్, ఇతరులతో కలిసి సంకీర్ణం ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. జార్ఖండ్‌లో ప్రధాన ప్రతిపక్ష స్థానంలో బీజేపీ ఉంది. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాల్లో రిజర్వుడ్ ఎస్టీ ఎమ్మెల్యే స్థానాలు 28 ఉన్నాయి. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా అత్యధిక గిరిజన స్థానాలను గెలుచుకుంది. 2000లో జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రాన్ని ఏడుగురు ముఖ్యమంత్రులు పాలించారు. వీరందరూ రాజకీయంగా నేటికీ క్రియాశీలకంగాఉండటంతోపాటు ప్రస్తుత జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పెరిగిన రాజకీయ శత్రువులు
జార్ఖండ్‌లో ముఖ్యమంత్రులు పూర్తిస్థాయిలో సీఎం పదవిలో కొనసాగడం చాలా అరుదు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా జైలులో ఉన్నప్పుడు 5 నెలల పాటు సీఎం పదవికి దూరంగా ఉన్నారు. చాలామంది గిరిజన నేతలు ఇటీవల హేమంత్ సోరెన్‌ను విడిచిపెట్టి ఆయనను వ్యతిరేకిస్తుండటం కీలక పరిణామం. హేమంత్ సోరెన్ తండ్రి తప్ప, ఇతర మాజీ ముఖ్యమంత్రులు మరాండీ, అర్జున్ ముండా, చంపయి సోరెన్, రఘుబర్ దాస్ ప్రస్తుతం హేమంత్ సోరెన్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఆయన వ్యతిరేక పంథాను అనుసరిస్తున్నారు. హేమంత్ సోరెన్ కు శత్రువుల తాకిడి ఎక్కువగానే ఉంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ బంధువులు, ఆయన భార్య కూడా పోటీ చేస్తున్నారు. ఇలాంటి వంశపారంపర్య రాజకీయాలను ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి.
ప్రస్తుత రాజకీయ వాతావరణం
జార్ఖండ్ ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సానుభూతి వేవ్‌పై ఆధారపడి ఉన్నారు. కానీ, ఆ సింపతీ సెంటిమెంట్‌ని జూన్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే వాడుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సానుభూతితో ప్రజలు ఆయనకు ఓట్లు వేస్తారా అనేది అనుమానమే. చాలామంది సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా చంపయి సోరెన్ 5 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం హేమంత్ సోరెన్ అహంకార వైఖరితో ఆయనను పదవి నుంచి తొలగించారు. దీంతో చంపయి సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చాకు దూరమయ్యారు. ఇలాంటి సీనియర్ నాయకులతో హేమంత్ సోరెన్ పోరాడుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత?
హేమంత్ జార్ఖండ్‌లోని శక్తిమంతమైన గిరిజన నాయకులందరికీ రాజకీయ శత్రువుగా మారిపోయాడు. వారు హేమంత్ సోరెన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. 2019లో భారతీయ జనతా పార్టీ ఓటమి తర్వాత, ఏ నాయకుడైనా కమలం పార్టీలో చేరాలనుకుంటే వారికి బీజేపీ హైకమాండ్ రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు బీజేపీ గిరిజన నాయకులైన సరయు రాయ్ వంటి ప్రముఖ నాయకులతో కూడిన పెద్ద సైన్యాన్ని సమీకరించింది. మరోవైపు హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా పెరిగి ఉంది. ఎందుకంటే హేమంత్ సోరెన్ తన పాలనలో ‘ఫ్రీబీస్’ తప్ప ఎటువంటి అభివృద్ధి లేదా గణనీయమైన మెరుగుదలను చూపలేదు.
బీజేపీ వ్యూహాత్మక పోరు
2000 నుంచి జార్ఖండ్‌లో ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈక్రమంలో హేమంత్ సోరెన్ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే దీని ప్రభావం బీజేపీపై పడుతుంది. ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఆదరణ తగ్గినట్టే భావించాలి. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ రాణించలేకపోయింది. ఒకవేళ బీజేపీ విజయం సాధిస్తే ఆ పార్టీకి సానుకూల పవనాలు వీచనున్నాయి. జార్ఖండ్‌లో బీజేపీ విజయం పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జార్ఖండ్‌లో బీజేపీ గెలిస్తే, మహారాష్ట్రలో నష్టం తక్కువగా ఉంటుంది. అయితే, జార్ఖండ్, మహారాష్ట్ర రెండింటినీ బీజేపీ గెలిస్తే, అప్పుడు ఇండియా కూటమి పీకల్లోతు కష్టాల్లో పడుతుంది.
బీజేపీ గిరిజన సీఎంలు
బీజేపీ ఆదివాసీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి వారికి సముచిత పదవులతో సత్కరిస్తోంది. గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా, అదేవిధంగా గిరిజన నేతలను ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు ముఖ్యమంత్రులుగా చేసిందని గుర్తుంచుకోవాలి. జార్ఖండ్‌లో బీజేపీ గెలిస్తే ఆదివాసీ రాష్ట్రాలన్నింటిని కైవసం చేసుకున్న పెద్ద ఘనతను సాధించినట్లు అవుతోంది. కాగా, జార్ఖండ్, బిహార్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయనేది మనం గుర్తుంచుకోవాలి.
ఫలితాలు తారుమారు
జార్ఖండ్ రాష్ట్రం మహారాష్ట్ర అంత పెద్దది కాదనేది వాస్తవమే. కానీ, ఆ రాష్ట్రానికి గొప్ప సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత ఉంది. అందుకే జార్ఖండ్‌లో విజయం సాధించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఎన్నికల పోరులో చిన్న రాష్ట్రాల ఫలితాలు ఊహించడం కష్టం. హిమాచల్ ప్రదేశ్, హర్యానా ఫలితాలు ఎవరూ కచ్చితంగా ఊహించలేదు. ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి. చిన్న రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద నాయకులు ఉన్నారు. అందువల్ల నాయకులు తమ శాయశక్తులా తీవ్రంగా పోరాడతారు. దీంతో ఫలితాలు ఊహించలేనివిగా మారతాయి. జార్ఖండ్‌లో చాలామంది మాజీ ముఖ్యమంత్రులు, నాయకులు ఎన్నికల బరిలో ఉన్నారు.
కాంగ్రెస్‌కు గెలుపు రాజకీయ అనివార్యం
కాంగ్రెస్‌కు జార్ఖండ్ అత్యంత కీలక రాష్ట్రంగా మారింది. ఎందుకంటే.. 2024లో హర్యానా, జమ్ము కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే జరగగా, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల ఎన్నికలు కొన్ని రోజుల వ్యవధిలో జరగబోతున్నాయి. జూన్‌లో జరిగిన -పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి చాలా బాగా పనిచేసింది. కానీ, బీజేపీ హర్యానాలో గెలవడంతోపాటు జమ్మూ కాశ్మీర్‌లోనూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. హర్యానా, కాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించలేకపోగా పేలవమైన ఫలితాలతో నిరాశ పరిచింది. ఈనేపథ్యంలో జార్ఖండ్, మహారాష్ట్రలో కాంగ్రెస్ గణనీయమైన ఫలితాలను తప్పక సాధించి తీరాలి. లేకుంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పరువుకు భంగం కలుగుతుంది.
- పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ ఎనలిస్ట్