మహబూబ్​నగర్ జిల్లాలో వరి చేన్లపై వింటర్​ ఎఫెక్ట్

  • పెరిగిన చలి తీవ్రత
  • పైర్లపై సుక్ష్మధాతు, ఫంగస్​ ప్రభావం
  • నాట్లేసిన వారానికే చచ్చిపోతున్న  మొక్కలు

మహబూబ్​నగర్​, వెలుగు : ఈ యాసంగి సీజన్​లో రైతులు పెద్ద మొత్తంలో వరి సాగుకు సిద్ధం అవుతున్నారు. నారు పోసుకొని ఇటీవల నాట్లు వేయగా.. వెదర్​ ఎఫెక్ట్​ వల్ల చాలాచోట్ల  పొలాలు దెబ్బతింటున్నాయి. చలి ఎక్కువ కావడంతో మొక్కలు చనిపోతున్నాయి.  

3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో వానాకాలం, యాసంగి సీజన్​లలో రైతులు మేజర్​ పంటగా వరి సాగు చేయడం ఆనవాయతీగా వస్తుంది. ఇందులో వానాకాలం సీజన్​లోనే పెద్ద మొత్తంలో వరి సాగు చేసి.. సాగునీటి ఇబ్బందుల దృష్ట్యా యాసంగిలో బోర్ల సౌలత్​ ఉన్న రైతులు మాత్రమే వరి సాగుకు ముందుకు వస్తారు. అయితే గత యాసంగితో పోలిస్తే ఈ సారి రెండు జిల్లాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. నిరుడు యాసంగిలో రెండు జిల్లాల్లో దొడ్డు, సన్నాల సాగు 2.10 లక్షల ఎకరాలకే పరిమితం కాగా.. ఈసారి రెట్టింపు అయ్యింది. నిరుడు పాలమూరు జిల్లాలో 90 వేల ఎకరాల్లో వరి సాగైతే.. ఈసారి 1.50 లక్షల ఎకరాలకు పెరిగింది. నారాయణపేట జిల్లాలో నిరుడు 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈసారి 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 

వరి పొలాలపై చలి ఎఫెక్ట్​

యాసంగి సాగుకు సిద్ధమైన రైతులు గత డిసెంబరు నుంచి నారుమళ్లు పోసుకున్నారు. కరిగెట్టను సిద్ధం చేసుకొని.. రెండు వారాలుగా నాట్లు మొదలు పెట్టుకున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో దాదాపు 60 శాతం వరకు నాట్లు పూర్తయ్యాయి. ఈ టైంలో వరి పొలాలపై వెదర్ ఎఫెక్ట్​ పడుతోంది. కొద్ది రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి  ఎక్కువగా ఉంటోంది. దీనికితోడు  మధ్యాహ్న టైంలో  చలిగాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల వరి పొలాలు దెబ్బతింటున్నాయి. ప్రధానంగా సుక్ష్మధాతు లోపం ఏర్పడుతోంది. అలాగే చలికి వైరస్​ సోకుతోంది. దీంతో నాట్లు వేసిన  వారం, పది రోజులకే వరి చేన్లు చనిపోతున్నాయి. 

ఇలా చేయాలె..

చలి ప్రభావం వల్ల వరి పొలాలకు ఐరన్​ లోపం  వస్తోంది. నాట్లు పెట్టుకున్న కొద్ది రోజులకే ఉదయం, రాత్రి చల్లదనం వల్ల వరి పొలాలు సూక్ష్మధాతు లోపానికి గురవుతున్నాయి. మూడు, నాలుగు రోజుల పాటు నీటిని మార్చకుండా ఉంచితే చలి ప్రభావానికి పొలాలకు ఫంగస్​ వస్తుంది. దీని నివారణకు ఎకరా పొలంలో పెరాస్​ సల్ఫేట్​ మూడు గ్రాములను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు నీటిని మార్చి.. ప్రతి రోజూ తాజా నీటిని పొలాలకు పారించాలి. అడుగు పిండి పెట్టుకోవాలి. ఏకరాకు ఒక సంచి డీఏపీ, 20-20, 28-28,  లేదా ఎస్​ఎస్​పీ అడుగుకు చల్లుకోవాలి. దీని వల్ల వరి మొక్కలు బలంగా పెరుగుతాయి. నీళ్లు మార్చడం వల్ల మొక్కలు కొలుకుంటాయి.

సాయంత్రం పూట నీళ్లు మార్చాలి

ఈ యాసంగిలో ఎక్కువగా వరి సాగు జరుగుతోంది. అయితే కొందరు రైతులు నాట్లు వేయాలనే తొందరలో అడుగు పిండి   వేయలేదు. దీంతో పొలాలు చనిపోతున్నాయి. ఇది తెలియక రైతులు యూరియా చల్లుతున్నారు. దీని వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. చలి ప్రభావం   వల్ల వరి చేన్లు ఎదగకపోతే పెరాన్​ సల్ఫేట్​ మూడు గ్రాములను ఓక లీటరు నీటిని కలిపి ఎకరా పొలంలో పిచికారి చేసుకుంటే సమస్య తీరుతుంది. 

వెంకటేశ్​, జిల్లా వ్యవసాయాధికారి, మహబూబ్​నగర్​