చలికాలం వచ్చిందంటే చాలు పాదాల పగుళ్లు మొదలవుతాయ్. పొలుసులు రాలుతూ బరుకుగా తయారవుతాయ్. ఆ పగుళ్లని నిర్లక్ష్యం చేస్తే రక్తస్రావం అయ్యి సమస్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల కాళ్ల పగుళ్లు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏయే టిప్స్ పాటించాలో తెలుసుకుందాం. .
మసాజ్
- నువ్వుల నూనెలో రెండు, మూడు చుక్కల గ్లిజరిన్ కలిపి పాదాలకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు తేమ అంది పగుళ్లు తగ్గుతాయి. అదే విధంగా టబ్ లో సగం వరకు గోరు వెచ్చని నీళ్లు నింపి అందులో రెండు టీస్పూన్ల గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఇందులో కాసేపు పాదాలు ఉంచి ఆ తర్వాత మసాజ్ చేసి మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా 15 రోజులకి ఒకసారి చేస్తే పగుళ్లు తగ్గుతాయి.
- పెరుగు, వెనిగర్ని సమపాళ్లలో తీసుకుని మసాజ్ చేస్తే పాదాలు మెత్తగా మారతాయి. రాత్రి పడుకునే సమయంలో హ్యాండ్ క్రీమ్ తీసుకుని అందులో కాస్త నిమ్మరసం కలిపి పాదాలకు రాసి మృదువుగా మసాజ్ చేస్తే సమస్య దూరం అవుతుంది.
- ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి కొద్దిసేపటి తర్వాత చల్లని నీళ్లలో కడిగి మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే పాదాల మీది పగుళ్లు పోయి చర్మం మృదువుగా ఉంటుంది. రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపి పాదాలకు రాసి మసాజ్ చేసినా ఫలితం ఉంటుంది.
- రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని పగుళ్లున్న చోట దూదితో రాసి, కొద్ది సేపటి తరువాత కడగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే పగుళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టి పాదాలు మృదువుగా అవుతాయి.
Also Read :- ఇంట్లోని దోమలు, ఈగలు, బొద్దింకలను ఇలా తరిమేయొచ్చు
పాదాలకు ప్యాక్
- అరటి పండు గుజ్జుని పాదాలకు రాసి పది నిమిషాల తర్వాత మసాజ్ చేయాలి. కాలి వేళ్లు, వాటి సందుల్లోనూ మసాజ్ చేయాలి. అనంతరం ఓ 20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల పగుళ్ల సమస్య దూరమవుతుంది.
- అరటిపండు నేచురల్ స్కిన్ మాయిశ్చరైజర్ పగిలిన, పొడిబారిన పాదాలను సున్నితంగా మార్చడంలో అరటిపండు బాగా పనిచేస్తుంది. కాబట్టి పగుళ్ల సమస్య ఉన్నవాళ్లకి ఈ ఫ్రూట్ మాస్క్ బాగా పనిచేస్తుంది. కేవలం పండు మాత్రమే. కాదు.. తొక్కలోనూ అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీనితో పాదాలను రుద్దడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి. చర్మాన్ని హైడ్రేషన్ చేయడంలో అరటిపండు బాగా పనిచేస్తుంది. కాబట్టి పగుళ్ల సమస్య ఉన్నవారు.. వారానికి ఒక సారి ఈ మాస్క్ వేయడం వల్ల ఉపశమనం ఉంటుంది.
జాగ్రత్తలు తప్పనిసరి
రాత్రిళ్లు సాక్సులు వేసుకుని పడుకోవాలి. దీని వల్ల పగుళ్ల సమస్య త్వరగా తగ్గుతుంది. అసాక్సులను రెగ్యులర్ గా వాష్ చేయాలి. పగుళ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు హైహీల్స్ వేసుకుంటే పాదాల చర్మం దెబ్బతింటుంది. వెన్ను నొప్పి వస్తుంటుంది. అందువల్ల చలికాలంలో హైహీల్స్ మానేయాలి. అలాగే ప్రతిరోజూ పాదాలకు వ్యాయామం తప్పనిసరి. పాదాలను నేలపై ఉంచి, గుండ్రంగా రెండు వైపులా తిప్పాలి. అదే విధంగా కాలివేళ్ల పైనే నిలబడాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు మంచి వ్యాయామం అంది అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కాలి వేళ్ల గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి.
–వెలుగు,లైఫ్–