రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. వాతావరణం కూల్ కూల్ గా మారి పోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఉదయం పది గంటలు దాటినా బయటకు రావాలంటే భయం వేస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకే చలి మొదలవుతుంది. సూర్యుడు కనిపించకుండా పోతున్నాడు. జనాలు వణికిపోతున్నా. .. కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చలికి భయపడాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు.
చలి కాలంలో ఆరోగ్యం గురించి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. పైగా జలుబు, దగ్గు అంటు వ్యాధులు. సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అలాగే ఆస్తమా ఉన్న వాళ్లు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తులపై ఈ వాతావరణం చాలా ప్రభావం చూపుతుంది.
పురిటి బిడ్డలపై తల్లులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. పసిపిల్లలు కూడా చలికి అసలు తట్టుకోలేరు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ డ్రెస్ తో పాటు జర్కిన్ లేదా కోటు వేసు కోవాలి. మంకీక్యాప్ లు ధరించాలి.రా త్రిళ్లు పొగమంచు పడతుంది కాబట్టి, పెద్దవాళ్లు కూడా అత్యవసరమైతే తప్ప ఇల్లుదాటి బయటకు వెళ్లకపోవడమే మంచిది. గర్భిణీలు, వయసులో పెద్ద వాళ్లు చలి నుంచి బయటపడాలంటే ఉదయం వాకింగ్, సాయంత్రం బయటకెళ్లడం మానేయాలి. ఈ కాలంలో కొందరిలో డి విటమిన్ లోపం కనిపిస్తుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా ఎండ వచ్చినప్పుడు కొంతసేపైనా సూర్యడి కిరణాలు శరీరంపై పడేలా చూసుకోవాలి.
-వెలుగు, లైఫ్-