మోటర్ల కనెక్షన్ కట్ చేసి కరెంటు వైర్లు ఎత్కపోయిన్రు

కరీంనగర్: దొంగలు బరి తెగిస్తున్నారు. రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు తీగలను ఎత్తుకెళ్లారు. సర్వీస్ వైరు నుంచి వ్యవసాయ మోటార్లకు ఉన్న కరెంటు కనెక్షన్ కట్ చేసి మరీ తీగలను కట్ చేసి, వాటిని తీసుకుని పరారయ్యారు. రామడుగు మండలం షా నగర్ లో వరద కాలువ నుంచి పైప్ లైన్లు ఏర్పాటు చేసుకున్న రైతులు విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని పొలాలకు మళ్లించుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. 

సర్వీస్ నుంచి రైతులు కరెంటు వాడుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో రైతులు వరద కాలువ నుంచి పైప్ లైన్లు ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ మోటార్ల ద్వారా పంపింగ్ చేసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు పొలాల వద్దకు వచ్చి కరెంట్ కనెక్షన్ ఆఫ్ చేసి..తీగలు కట్ చేసుకుని వెళ్లారు. ఎలక్ట్రీషియన్ పని గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

30 మంది రైతులకు చెందిన కేబుల్ చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు చోరీ చేసిన కరెంటు తీగల విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. పంటలు చేతికి వచ్చే దశలో కరెంటు తీగలు చోరీ కావడం తమకు ఆర్ధికంగా చాలా భారమని రైతులు వాపోయారు. అప్పులు చేసి పంటలు సాగు చేసిన తాము మళ్లీ ఇప్పుడు వేలు ఖర్చు చేసుకుని కొత్త కేబుల్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లేదా పోలీసులు చోరీకి గురైన తమ కేబుళ్లు రికవరీ చేసి తమకు అందించి.. ఆదుకోవాలని రైతులు కోరారు.