
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, విమెన్స్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక విజ్డెన్ క్రికెటర్స్ 2025 పురస్కారాల్లో ఈ ఇద్దరికి చోటు లభించింది. బుమ్రా ‘విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్’ అవార్డును సొంతం చేసుకోగా, విమెన్స్‌లో స్మృతి ఈ పురస్కారానికి ఎంపికైంది. 2024 సీజన్‌లో బుమ్రా 14.92 సగటుతో 71 టెస్ట్ వికెట్లు తీశాడు. దీంతో ఒక ఏడాదిలో ఇంత ఎకానమీతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఇక టెస్ట్ చరిత్రలో 20 కంటే తక్కువ యావరేజ్‌తో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఒంటిచేత్తో ఇండియా బౌలింగ్ భారాన్ని మోసిన బుమ్రా 13.06 యావరేజ్‌తో 32 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్ కప్‌లోనూ 4.17 ఎకనామీతో 15 వికెట్లు తీశాడు. దాంతో 2013 తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు.
ఈ అవార్డుతో బుమ్రా.. సచిన్ (1), సెహ్వాగ్ (2), కోహ్లీ (3) సరసన చోటు సంపాదించాడు. ‘విజ్డెన్ విమెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్’ అవార్డును సాధించిన మంధాన గతేడాది మూడు ఫార్మాట్లలో కలిపి 1659 రన్స్ చేసింది. విమెన్స్ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఇన్ని రన్స్ ఎవరూ చేయలేదు. 2024లో మంధాన వన్డేల్లో 4 సెంచరీలు చేసి రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాపై టెస్ట్ సెంచరీ (149) కూడా సాధించింది. ఈ అవార్డును రెండుసార్లు గెలిచిన తొలి ఇండియన్ విమెన్ ప్లేయర్‌గా మంధాన రికార్డులకెక్కింది. 2018లో తొలిసారి ఈ పురస్కారం దక్కింది. విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు ‘లీడింగ్ టీ20 ప్లేయర్ ఇన్ ద వరల్డ్’ అవార్డు లభించింది.