ముంబై: యాపిల్ కోసం ఐఫోన్తయారు చేసే తైవాన్ కంపెనీ విస్ట్రాన్ కార్ప్మన దేశంలోని పెద్ద కార్పొరేట్గ్రూప్ టాటా చేతికి రానుంది. ఇది కార్యరూపంలోకి వస్తే ఐఫోన్ తయారు చేసే మొదటి ఇండియన్ కంపెనీగా టాటా గ్రూప్ అవతరిస్తుంది. విస్ట్రాన్ కార్ప్ కొనుగోలుకు గత కొన్ని నెలలుగా టాటా గ్రూప్ ప్రయత్నాలు జరుపుతోంది. మార్చి చివరినాటికి ఈ టేకోవర్ ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జాయింట్ వెంచర్లో టాటా గ్రూప్‌కు మెజారిటీ వాటా ఉండేలా డిస్కషన్స్ సాగుతున్నట్లు తెలుస్తోంది. మాన్యుఫాక్చరింగ్ యాక్టివిటీ మొత్తం టాటా గ్రూప్ అజమాయిషీలోనే నడుస్తుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం విస్ట్రాన్ కార్ప్ అవసరమైన సహకారాన్ని మాత్రమే అందిస్తుంది. తైవాన్ కంపెనీలయిన విస్ట్రాన్కార్ప్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌లే యాపిల్‌కు ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తూ, అతి పెద్ద సప్లయర్లుగా నిలుస్తున్నాయి.
చైనాతో పోటీలో ముందడుగు....
ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనాతో పోటీ పడేందుకు గట్టి పోటీదారులను తయారు చేయాలని మన దేశం ప్రయత్నాలు చేస్తోంది. టాటా గ్రూప్ చేతికి ఐఫోన్ తయారీ వస్తే ఈ విషయంలో ఒక అడుగు ముందుకు పడినట్లే అవుతుంది. అమెరికాతో సంబంధాలు చెడిపోవడంతోపాటు, కొవిడ్ సంబంధ సమస్యలతోనూ చైనా సతమతమవుతోంది. మార్చి 2023 చివరినాటికి డ్యూ డెలిజెన్స్ ప్రక్రియ పూర్తి చేయాలని టాటా గ్రూప్లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ పొందేందుకు వీలైనంత తొందరగా విన్స్ట్రాన్ కార్ప్‌ను చేజిక్కించుకోవాలనేది టాటా గ్రూప్ ఆలోచన. ఇండియాలోని విస్ట్రాన్ ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్ఫెసిలిటీ వాల్యుయేషన్ 600 మిలియన్డాలర్లదాకా ఉండొచ్చని అంచనా. టాటా గ్రూప్ డిస్కషన్స్‌పై మాట్లాడడానికి అటు విస్ట్రాన్, ఇటు యాపిల్ అంగీకరించలేదు.
ఇండియాలో మొత్తం మూడు తైవాన్ కంపెనీలు ఐఫోన్మాన్యుఫాక్చర్ చేస్తున్నాయి. విస్ట్రాన్తోపాటు ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ కార్ప్‌లు యాపిల్ కోసం మన దేశంలో అసెంబ్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాయి. ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్లో మార్జిన్లు తక్కువనే కారణంతో సర్వర్లు వంటి వాటి తయారీకి మళ్లాలనేది విస్ట్రాన్ ప్లాన్. చైనాలోని ఐఫోన్ తయారీ యూనిట్‌ను 2020లోనే మరో కంపెనీకి విస్ట్రాన్ విక్రయించింది. విస్ట్రాన్ఇండియాలో ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా, మిగిలిన రెండు తైవాన్ కంపెనీలు మాత్రం తమ కెపాసిటీలను పెంచుతున్నాయి. మరోవైపు యాపిల్ కూడా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటోంది. కరోనా కారణంగా ఆ దేశంలో సప్లయ్ చెయిన్ దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.
యాపిల్‌తో మరింత బిజినెస్...
బెంగళూరు సమీపంలోని విస్ట్రాన్మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయింది. ఇందులో ఎనిమిది ఐఫోన్ లైన్లుండగా, పది వేల మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఇండియాలో ఐఫోన్ల తయారీకి సర్వీస్ పార్ట్నర్గా విస్ట్రాన్ కొనసాగుతుంది. యాపిల్‌తో కలిసి పనిచేయడానికి టాటా గ్రూప్చొరవ తీసుకుంటోంది. ఐఫోన్ కాంపోనెంట్లు తయారు చేసే తన హోసూర్ ఫ్యాక్టరీలో చురుగ్గా రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. ఇక్కడ కూడా ఐఫోన్ మాన్యుపాక్చరింగ్ లైన్లను భవిష్యత్‌లో ఏర్పాటు చేయాలనేది టాటా గ్రూప్ ఆలోచన. అంతేకాదు, దేశంలో 100 యాపిల్ స్టోర్లను తేనున్నట్లు టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. వీటిలో మొదటి స్టోర్‌ను ఈ క్వార్టర్లోనే ముంబైలో తెరవనున్నారు.