విశ్లేషణ : 371డికి వ్యతిరేకమైన 317 జీవోతో  లోకల్​ వారికి శాపమే

ఈ సమస్యను పరిష్కరించాలంటే ఉద్యోగులు, టీచర్ల కేటాయింపులో సీనియార్టీ ప్రాతిపదికన కాకుండా 80:20 ప్రకారం స్థానిక, స్థానికేతరులను పాఠశాల బోనఫైడ్ ఆధారంగా ఆయా జిల్లాలను కేటాయించాలి. ఇలా చేసినట్లయితే 90 శాతం సమస్య పరిష్కారం అవుతుంది. ఏ జిల్లాలో కూడా 20 శాతం కన్నా ఎక్కువగా స్థానికేతరులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉంటే అక్కడ సీనియర్లకు అవకాశం ఇచ్చి స్థానికేతరులైన జూనియర్లను వారి సొంత జిల్లాలకు పంపడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కార మార్గం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.


తెలంగాణ ఉద్యమంలో బరిగీసి కొట్లాడింది ఉద్యోగులు, టీచర్లే. సకల జనుల సమ్మెతో రాష్ట్రం మొత్తాన్ని స్తంభింపజేశారు. అంతటి ఘన చరిత్ర గల తెలంగాణ ఉద్యమం 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో సుఖాంతం అయిందని అంతా అనుకున్నారు. కానీ కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలోనే ప్రభుత్వం ఇచ్చిన 317 జీవోతో సమస్య మళ్లీ మొదటికి వస్తుందని అనుకోలేదు. ఏ స్థానికత కోసమైతే ప్రాణాలకు తెగించి పోరాటం సాగించామో.. ఇప్పుడు అదే స్థానికత చాలా మంది ఉద్యోగులు, టీచర్లకు లేకుండా పోతోంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర గల ప్రభుత్వంలో ఈ పరిస్థితి రావడం దారుణం.

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రాష్ట్రంలోని చివరి వ్యక్తి వరకూ చేరాలనే సర్కారు ప్రయత్నాలను అన్ని వర్గాలు స్వాగతించాయి. ఈ నేపథ్యంలోనే 2018లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. దానికి అనుగుణంగా 124 జీవో, తదుపరి 128 జీవో, వాటికి కొనసాగింపుగా ఇప్పుడు 317 జీవో ద్వారా రాష్ట్రంలో ఉద్యోగులు, టీచర్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఉన్నతాధికారుల నిర్లక్ష్యం అనాలో లేదా వారి సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారో తెలియదు కానీ 317 జీవోను అమలు చేయడం వల్ల వచ్చే సమస్యలను ముందస్తుగా అంచనా వేయలేకపోయారనేది మాత్రం నిజం. ఉన్నతాధికారులతో సమావేశమైన ఉద్యోగ సంఘాలు కూడా 317 జీవో అమలు వల్ల వచ్చే సమస్యలు తెలిసి ఒప్పుకొన్నాయా? లేదా తెలియక ఒప్పుకున్నాయా? లేదా ముందుగా అంచనా వేయలేకపోయాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
 

అన్ని సంఘాలతో చర్చించాల్సింది

రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 317 జీవోను రూపొందించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్టికల్​ 371డి అవసరం లేదని కొందరు వాదించారు. అయితే భౌగోళిక తెలంగాణలో కూడా చాలా అంతరాలు ఉన్నాయని, ఆర్టికల్​ 371డి అమలు కొత్త రాష్ట్రంలో కూడా అవసరమని మెజార్టీ సమాజం అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే 2018లో రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైనట్టు కనిపిస్తోంది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం 95:5 ప్రకారం కొత్త నియామకాలు చేపట్టనున్నందు వల్ల స్థానికతకు పెద్దపీట వేసినట్లు అర్థమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కూడా అదే. ఎన్నో పోరాటాలు చేసింది కూడా ఇందుకే. రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 30న జారీ చేసిన 124 జీవో ప్రకారం.. 31 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా ఏర్పరచడం, ఆ తర్వాత ఇచ్చిన 128 జీవో ప్రకారం ముప్పై మూడు జిల్లాలకు అనుమతి పొందడం చాలా మంచి పరిణామమే అని చెప్పవచ్చు.
 

స్థానికత అనే పదమే ఉత్తర్వుల్లో లేదు


అయితే 10 జిల్లాల ఉద్యోగులు, టీచర్లను 33 జిల్లాలకు కేటాయించటానికి రాష్ట్రపతి ఇచ్చిన కొత్త ఉత్తర్వుల్లో స్థానికత అనే పదం లేకపోవడం సీనియార్టీ అనే పదం మాత్రమే ఉండటం అసలు వివాదానికి కారణమైంది. ఏ స్థానికత కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో?, ఏ స్థానికులకు ప్రయోజనం కల్పించాలని కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయో? ఆ స్థానికులే ఉద్యోగులు, టీచర్ల కేటాయింపుల్లో స్థానికేతరులుగా అవుతున్నారు. స్థానికతను వదిలిపెట్టి సీనియార్టీని కొలమానంగా తీసుకోవడం వల్ల సీనియర్లు రంగారెడ్డి లాంటి నగర జిల్లాలకు, ఉమ్మడి జిల్లా కేంద్రాలు, పట్టణాలకు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇదే సమయంలో జూనియర్లు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు, రిమోట్​ ఏరియాలకు పరిమితం కావడమే కాక ఏకంగా సొంత జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్వీస్ లో సీనియర్ అయినా క్యాడర్​లో జూనియర్ అయిన టీచర్లు కూడా వేరే జిల్లాలకు కేటాయించబడరు. వీరందరూ పదవీ విరమణ పొందే వరకు అదే జిల్లాలో పని చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు, టీచర్లే కాక వారి పిల్లలు కూడా వేరే జిల్లాలకు స్థానికులుగా మారి సొంత జిల్లాలో స్థానికేతరులు కాబోతున్నారు. 

వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి

మల్టీ జోన్ పోస్టుల్లో ఉద్యోగులు, టీచర్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతాలను వదిలి వందల కిలోమీటర్ల దూరంలో ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా పోస్టులు, జోనల్ పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులు నిర్ణయించేటప్పుడు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాన్ని తీసుకుని స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ పోస్టులుగా పేర్కొని ఉంటే ఇంత పెద్ద ఆందోళన వచ్చి ఉండేది కాదు. ఏఎన్ఎం, హెడ్ కానిస్టేబుల్, సీనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు జోనల్ పోస్టులు చేసి ఆయా పోస్టులతో సమానమైన, అంతకంటే ఎక్కువ బేసిక్ పే ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టును జిల్లా పోస్ట్ చేయడం ఇంత ఆందోళనకు కారణమైంది. 

కొన్ని జిల్లాల్లోనే ఖాళీలు ఏర్పడే అవకాశం

మరో ప్రధాన సమస్య స్పౌజ్​ కేటగిరీ. సుమారు 70 శాతం మంది ఉద్యోగులు, టీచర్లు ఈ కేటగిరీలో ఉన్నారు. సీనియర్ అయిన ఉద్యోగి, టీచర్​ ఈ కేటగిరీ ద్వారా జీవిత భాగస్వాములను తామున్న ప్రాంతానికి తెచ్చుకునే అవకాశం ఉంది. అదే సమంజసం కూడా. అయితే స్పౌజ్​ కేటగిరీ పేరుతో అందరూ కొన్ని జిల్లాల్లో అక్కడ ఉన్న పోస్టుల కంటే ఎక్కువగా కేటాయించబడే అవకాశం ఉంది. అంతే కాకుండా కేటాయింపులు ఎక్కువగా ఉంటే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా సరే వారికి న్యాయం చేయాల్సిందే. దీని వల్ల కొన్ని జిల్లాల్లో మొత్తం సీనియర్లు, మరికొన్ని జిల్లాలో మొత్తం జూనియర్లు ఉండిపోతారు. ఇదే జరిగితే రాబోయే కాలంలో కొన్ని జిల్లాల్లో అసలు ఉద్యోగ ప్రకటనలే ఉండకపోవచ్చు. కొన్ని జిల్లాల్లో మాత్రం పెద్ద మొత్తంలో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉండొచ్చు. ఈ విధానం సమాజంలో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అంతే కాకుండా జూనియర్లు ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిపాలనా సామర్థ్యం లోపించే అవకాశం కూడా లేకపోలేదు.-