PHD చేసి.. నరరూప రాక్షసుడిగా మారిన బగ్దాదీ

PHD చేసి.. నరరూప రాక్షసుడిగా మారిన బగ్దాదీ

అబూ బకర్ అల్ బాగ్దాదీ అసలు పేరు ఇబ్రహీం అవ్వాద్ ఇబ్రహీం  అల్ బద్రి. 1971లో ఇరాక్ దేశంలోని సమర్రా నగరంలో పుట్టాడు. సున్నీ అరబ్ కుటుంబానికి చెందిన బాగ్దాదీకి చిన్నప్పటి నుంచి మతపరమైన భావాలు ఎక్కువ. చాలా చిన్న వయసులోనే ఎక్కువ సేపు  సమర్రా మసీదులో గడిపేవాడట. ఖురాన్ చదవడాన్ని గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడట. 1990లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాక ఆయన బాగ్దాద్ వెళ్లిపోయాడు. ఇస్లామిక్ స్టడీస్ లో పీహెచ్. డీ చేశాడని ఆయన అనుచరులు చెబుతారు.

2003 తరువాత జిహాద్ వైపు గా అడుగులు..

2003లో ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్​ను అమెరికా కూలదోసిన తరువాత జిహాద్ వైపుగా బాగ్దాదీ అడుగులు వేశాడు. అమెరికాకు వ్యతిరేకంగా ‘జమాత్ జయాష్ అహల్ అల్ సున్నా వా జమా’ అనే టెర్రరిస్టు సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ టెర్రరిస్టు గ్రూపులో మతపరమైన అంశాలకు సంబంధించిన ‘షరియా కమిటీ’ కి చీఫ్ గా ఉండేవాడు. 2004లో బాగ్దాదీని అమెరికా దళాలు పట్టుకున్నాయి. సౌత్ బాగ్దాద్ లోని ‘క్యాంప్ బుక్కా’ గా పాపులరైన డిటెన్షన్ క్యాంపులో బాగ్దాదీని నిర్బంధించారు. బాగ్దాదీతో పాటు అనేక మంది టెర్రరిస్టులను ఇక్కడే బందీలుగా ఉంచింది అమెరికా. ఈ సమయంలోనే తనతో పాటు నిర్బంధంలో ఉన్న మిగతా టెర్రరిస్టులతో బాగ్దాదీ పరిచయాలు పెంచుకున్నాడు. టెర్రరిస్టు నేతగా ఎదిగాడు.

‘అల్ ఖైదా ఇన్ ఇరాక్’ లో చేరిక..

క్యాంప్​ బుక్కా నుంచి విడుదలైన తరువాత ‘అల్ ఖైదా ఇన్ ఇరాక్’ (ఏక్యూఐ) పేరుతో కొత్తగా పుట్టిన మరో టెర్రరిస్టు సంస్థతో  బాగ్దాదీ సంబంధాలు పెంచుకున్నాడు.అప్పటికి జోర్దాన్​కు చెందిన అబు ముసాబ్ అల్ జరఖావి ఈ సంస్థకు నాయకుడిగా ఉండేవాడు. జరఖావి నాయకత్వంలో చాలా తక్కువ సమయంలోనే ‘ఏక్యూఐ’ సంస్థ ఇరాక్​లో ఒక మేజర్ ఫోర్స్​గా అవతరించింది. 2006 నాటికి బాగ్దాదీ సొంత సంస్థతో పాటు పాటు మరికొన్ని సున్నీ తిరుగుబాటు టెర్రరిస్టు ఆర్గనైజేషన్ లు కలిసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’ పేరుతో ఒక పెద్ద సంస్థగా ఏర్పడ్డాయి. ఇదే ఏడాది అమెరికా దాడుల్లో అబు ముసాబ్ అల్ జరఖావి చనిపోయాడు. దీంతో ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’ పేరు మార్చారు. ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్’(ఐఎస్ఐ) అంటూ కొత్త పేరు పెట్టారు. 2010 నాటికి బాగ్దాదీ ఈ సంస్థకు అధినేత అయ్యాడు.  2013 నాటికి ఇరాక్​లో అనేక టెర్రరిస్టు దాడులకు ఐఎస్ఐ పాల్పడింది.

సిరియా కేంద్రంగా మిలిటెంట్​ చర్యలు

సిరియాలో ప్రెసిడెంట్ బషర్ అల్ అస్సద్​కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు బాగ్దాదీ అండగా నిలబడ్డాడు. అదే ఏడాది ఏప్రిల్ నెలలో ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్ ’ (ఐఎస్ఐఎస్ ) ఏర్పాటు చేశాడు బాగ్దాదీ. ఇదే ఏడాది చివరిలో ఇరాక్ పై  ఐఎస్ఐఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడి షియా ప్రభుత్వం, మైనారిటీ సున్నీ వర్గీయుల మధ్య ఉన్న గొడవలను తనకు అనుకూలంగా మార్చుకుంది. 2014 జూన్ లో ఇరాక్ బలగాలను తరిమికొట్టి  మోసుల్ నగరాన్ని ఐఎస్ఐఎస్  టెర్రరిస్టులు ఆక్రమించుకున్నారు. ఆ తరువాత బాగ్దాద్ వైపు దూసుకొచ్చారు. జూన్ చివరి నాటికి ఇరాక్ దేశంలోని అనేక నగరాలు, చిన్న చిన్న పట్టణాలను ఐసీస్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. షరియా (ముస్లిం ధర్మ శాస్త్రం) ప్రకారం ఖలీఫా రాజ్యాన్ని’  ఏర్పాటు చేస్తున్నట్లు ఐఎస్ఐఎస్  ప్రకటించింది. దీనికి ‘ఇస్లామిక్ స్టేట్’ అంటూ పేరు పెట్టింది.  అబూ బకర్ అల్ బాగ్దాదీని ‘ఖలీఫా ఇబ్రహీం’ గా డిక్లేర్ చేసింది.

2014 ఫిబ్రవరి వరకు అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థ ‘అల్ ఖైదా’తో ఐఎస్ ఐఎస్ కు సంబంధాలున్నాయి. అయితే ఆధిపత్య పోరు తలెత్తడంతో ఆ తరువాత అల్ ఖైదాతో ఈ సంస్థ  సంబంధాలు తెంచుకుంది.అయితే బాగ్దాదీ అంత క్రూరమైన టెర్రరిస్టు చరిత్రలో ఎవరూ లేరని చెబుతారు.

ఆయిల్​తో అంతులేని ఆదాయం

ఇస్లామిక్​ స్టేట్​ పేరిట సొంత రాజ్యాన్ని స్థాపించటానికి 1999లో పుట్టుకొచ్చిన ఐసిస్​ ఈ 20 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 దేశాలకు విస్తరించినట్లు అంచనా. ఏడాదికొక దేశంలోకి ఎంటరవటానికి ఆ టెర్రరిస్ట్​ సంస్థకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవనే విషయం చర్చకు దారితీసేది. ఆయిల్​ బిజినెస్​ ద్వారా ఐసిస్​కి ఏటా కొన్ని కోట్ల డాలర్లలో రాబడి వచ్చేదని  కొయిలేషన్​ ఫోర్సెస్​ అధికార ప్రతినిధి తెలిపారు.

  • ఐసిస్ ముఖ్యంగా ఐదు మార్గాల్లో డబ్బు సంపాదించిందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్​ఫోర్స్ నాలుగేళ్ల క్రితం జరిపిన స్టడీలో తేలింది.
  • ఆక్రమించిన ప్రాంతాల్లోని బ్యాంకులు, ట్యాక్స్​లు, బలవంతపు వసూళ్లు, దొంగతనాల ద్వారా ఆ టెర్రరిస్ట్​ సంస్థ భారీగా సొమ్ము చేసుకుంది.
  • కిడ్నాప్​లకు పాల్పడటం, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల నుంచి మానవత్వ సాయం పొందటం, వేరే దేశాల దళాలిచ్చే డబ్బును కూడబెట్టడంతోపాటు మోడ్రన్​ కమ్యూనికేషన్ నెట్​వర్క్​ల ద్వారా ఐసిస్​ నిధులు సేకరించింది.
  • వీటన్నింటినీ మించి క్రూడాయిల్​ ఉత్పత్తిని తన చేతుల్లోకి తీసుకొని, ఆయిల్​ ఎగుమతులతో కోట్లాది డాలర్లు సంపాదించింది.  కేవలం చమురు వ్యాపారంలోనే 2015లో నెలకు 4 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చేది. అయితే, ఆ తర్వాత భారీగా తగ్గింది.
  • ఐసిస్​ ఖాతాలోకి ఏటా సుమారు 5 కోట్ల డాలర్లుఆదాయం వచ్చిపడేది.
  • 2017 జూలైలో వెస్ట్రన్​ మిలటరీ, ఇరాకీ ఆర్మీ జరిపిన దాడుల్లో కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగలటమే దీనికి కారణం.
  • అనేక దేశాల్లో ఐసిస్ పట్టుకోల్పోయింది. ఈ అక్టోబర్​ నాటికి నెలకు వచ్చే రెవెన్యూ 4 కోట్ల డాలర్ల నుంచి 40 లక్షల డాలర్లకు తగ్గింది.
  • వీటికితోడు యాంటిక్స్​ని, విలువైన వస్తువులను బ్లాక్​ మార్కెట్​లో అమ్మి ఖజానా నింపుకునేది.

కళాఖండాలను కూల్చేసిన ఐసీస్

ఇరాక్ లో కొన్ని వేల ఏళ్ల కిందటి అసీరియన్ నాగరికతకు సాక్ష్యాలుగా ఉన్న అద్భుత కళాఖండాలను కూల్చేసిన చరిత్ర కూడా ఐసీస్ దే. ఈ కళాఖండాలను మోసుల్ నగరంలోని నైన్ వా మ్యూజియంలో భద్రపరిచారు. ఇరాక్​కు విదేశీ టూరిస్టులు ఎవరొచ్చినా వీటిని చూడకుండా వెళ్లరు. వీటిని 2015లో  బాగ్దాదీ అనుచరులు కూల్చేశారు. ప్రజలను రెచ్చగొట్టడంతో  రాత్రికి రాత్రి జనం మ్యూజియంలోకి  ఎంటరయ్యారు. ఇనుప రాడ్లు, సుత్తులతో విగ్రహాలను కూల్చేశారు. కొన్ని చోట్ల మెషీన్ లను కూడా ఉపయోగించి విగ్రహాలను కూల్చేశారు.