మంచిర్యాల జిల్లా కాంగ్రెస్​లో జోష్​

  • వివేక్ ​చేరికతో హస్తం పార్టీలో నూతనోత్సాహం
  • ఆయన రాకను స్వాగతిస్తూ జిల్లా వ్యాప్తంగా సంబురాలు
  • ఇక బీజేపీ, బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి వలసలు

మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ జి.వివేక్ ​వెంకటస్వామి చేరికతో జిల్లా కాంగ్రెస్​లో జోష్​ కనిపిస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్​ మేనిఫెస్టో కమిటీ చైర్మన్​గా ఉన్న ఆయన బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి రాహుల్​గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేశారు. నాలుగేండ్లుగా బీజేపీలో కొనసాగుతున్న వివేక్ సొంత గూటికి తిరిగి రావడాన్ని కాంగ్రెస్ ​నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో స్వాగతించారు. చెన్నూర్​ నియోజకవర్గంతో పాటు పలుచోట్ల ర్యాలీలు తీసి పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.

ఐదు దశాబ్దాల అనుబంధం 

వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీకి మంచిర్యాల జిల్లాతో ఐదు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్​ 2009లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విశేషంగా కృషి చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల బీఆర్ఎస్​లో చేరిన వివేక్ ​రాష్ట్ర ఏర్పాటు తర్వాత సొంత పార్టీలోకి వచ్చారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి తెలంగాణ సెంటిమెంట్ ​కారణంగా ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ బీఆర్ఎస్​లో చేరి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ టికెట్​ఇవ్వకుండా మోసం చేయడంతో  2019 ఆగస్టులో బీజేపీలో చేరారు. నాలుగు సంవత్సరాలకు పైగా బీజేపీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. జీహెచ్​ఎంసీ ఎలక్షన్లు, దుబ్బాక, హుజూరాబాద్​ బైపోల్స్​లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించారు.

బీఆర్​ఎస్, బీజేపీలో కలవరం

బీఆర్ఎస్, బీజేపీల్లోని వివేక్ అనుచరులు, అసమ్మతివాదులు, అసంతృప్త నాయకులు ఇప్పుడు కాంగ్రెస్​ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీకి రాజీనామాలు ప్రకటించారు. రూలింగ్​పార్టీలో గుర్తింపు దక్కనివారు, సిట్టింగ్​ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్నవారు బీఆర్ఎస్​ను ఓడించడమే ధ్యేయంగా కాంగ్రెస్​లో చేరడానికి చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే రెండు పార్టీల నుంచి వలసలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీల్లో కలవరం మొదలైంది. క్యాడర్​ చేజారిపోకుండా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

కాంగ్రెస్​కు కొండంత బలం 

వివేక్​ చేరిక జిల్లా కాంగ్రెస్​ వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపింది. పార్టీలకతీతంగా ఆయనకు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుచరులు, అభిమానులు ఉన్నారు. కొంతకాలంగా వివేక్​ కాంగ్రెస్​లోకి రావాలని కోరుకుంటున్న వారంతా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేరిక పార్టీకి కొండంత బలాన్నిచ్చిందని నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. చెన్నూర్​ నియోజకవర్గం నుంచి తమ నేత పోటీ చేయాలని వారు కోరుతున్నారు.

పదవులు ఉన్నా లేకున్నా ఎల్లవేళలా ప్రజల మధ్యన ఉంటూ ఆయా వర్గాల సమస్యలపై ఆయన పోరాటాలు చేశారని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్​ ముంపు రైతులు, మంచిర్యాలలోని ముంపు బాధితులు, సింగరేణి కార్మికుల సమస్యలపై వివేక్​ గత నాలుగేండ్లుగా పోరాడుతున్నారు. ఆయన చేరికతో జిల్లాలో కాంగ్రెస్​గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.