- అంతరిక్ష శాఖకు రూ.13,415 కోట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి
- నిరుటి కన్నా రూ.415 కోట్లు పెరిగిన నిధులు
- ఇస్రో సెంటర్లకే రూ.10 వేల కోట్లు అలాట్
న్యూఢిల్లీ:అంతరిక్ష రంగంలో భారత్ మరింత ముందుకు వెళ్లేందుకు వీలుగా అంతరిక్ష శాఖ(డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్)కు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిధులను పెంచారు. ఈ ఏడాది కీలక మిషన్లు చేపట్టేందుకు సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు బడ్జెట్లో బూస్ట్ ఇచ్చారు.
ఈ బడ్జెట్లో అంతరిక్ష శాఖకు మొత్తం రూ.13,415 కోట్లు కేటాయించారు. పోయినసారి రూ.13,042.75 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.415 కోట్లు ఎక్కువగా నిధులు అలకేట్ చేశారు. దేశ అభివృద్ధి, పరిపాలనలో మెరుగుదల కోసం స్పేస్ టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం అందుకు తగినట్టుగానే నిధులు పెంచింది.
అంతరిక్ష శాఖకు పెరిగిన బడ్జెట్‌తో వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో స్పేస్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచేందుకు కూడా వీలు కానుంది.
ప్రాజెక్టులకు ఫండ్స్ ఇలా..
అంతరిక్ష శాఖకు మొత్తం కేటాయింపుల్లో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లకే రూ.10,230 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు.
ఇందులో సింహభాగం రూ. 6,103 కోట్లను అంతరిక్ష పరిశోధనలకు మూలధన పెట్టుబడిగా అలకేట్ చేశారు. ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు రూ.1,706 కోట్లు ఇచ్చారు. ఈ నిధులను శాటిలైట్ ప్రయోగాలు, డీప్ స్పేస్ మిషన్లకు ఇస్రో వినియోగించుకోనుంది.
కేంద్ర కేబినెట్ ఇటీవలే ఇస్రోకు సంబంధించిన కీలకమైన పలు మిషన్లకు ఆమోదం తెలిపింది. చంద్రయాన్4, శుక్రయాన్, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణం, తమిళనాడులో కొత్త స్పేస్ పోర్ట్ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి.
ప్రైవేట్ సెక్టార్‌కు ప్రోత్సాహం..
అంతరిక్షరంగంలో ప్రైవేట్ సెక్టార్‌ను ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను టెక్ హబ్‌గా మార్చేందుకు ఈ బడ్జెట్ కేటాయింపులు ఊతం ఇవ్వనున్నాయి. 2025–26 కేంద్ర బడ్జెట్లో అంతరిక్ష శాఖకు కేటాయింపులు పెంచడంతో దేశం స్పేస్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు దోహదం చేస్తుందని బెంగళూరుకు చెందిన ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ ‘పిక్సెల్’ సీఈవో అవైస్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా డీప్ టెక్, స్పేస్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ అంశాలకు గణనీయమైన మద్దతు లభిస్తుందన్నారు. నేషనల్ జియోస్పేషియల్ మిషన్, నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ వంటివి హైటెక్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరుగుదలకు తోడ్పాటును అందిస్తాయన్నారు.
అలాగే స్పేస్ సెక్టార్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పెంచేందుకు కేంద్రం ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్రం ఇప్పటికే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్(ఎఫ్ డీఐ) పాలసీని సడలించడంతో ఉపగ్రహాలు,వాటికి సంబంధించిన పరికరాల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను100% అనుమతించింది. దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం గణనీయంగా పెరగనుంది.