
హైదరాబాద్, వెలుగు: ఇనాం భూముల్ని 1955 తర్వాత కొంటే వాటికి అధీన ధ్రువీకరణ పత్రం (ఓఆర్‌సీ) పొందే హక్కు లేదా అందుకు దరఖాస్తు చేసుకునే హక్కు లేదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. గతంలో బి.రామచందర్‌రెడ్డి కేసు, ఎస్.వీరారెడ్డి కేసులో ధర్మాసనాలు వేర్వేరు తీర్పులు చెప్పాయి. దీంతో ఈ అంశంపై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ శ్రీసుధతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ఇనాందారు రద్దు చట్టం1955లో వచ్చిందని, ఆ తర్వాత ఇనాం భూములు కొనుగోలు చేస్తే.. వారికి ఓఆర్‌సీ హక్కు పొందే హక్కు చట్టంలో లేదని ఏజీ బీఎస్ ప్రసాద్ చేసిన వాదనను బెంచ్ ఆమోదించింది.
ఇనాం రద్దు తర్వాత భూములన్నీ ప్రభుత్వానివేనని స్పష్టం చేసింది. ‘‘ఇనాం రద్దు తర్వాత కొనుగోళ్లు చెల్లవు. ఓఆర్‌సీ పొందకముందు ఇనాందారుల భూక్రయవిక్రయాలు చెల్లుబాటు కావు. ఓఆర్‌సీ పొందడానికి చట్టంలో 5 కేటగిరీలు ఉన్నాయి. కబిజ్ ఎ ఖదిం, రక్షణ కౌలుదారు, శాశ్వత కౌలుదారులు ఓఆర్‌సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఆర్‌సీ లేని ఇనాం భూములు ప్రభుత్వానివే. ఇనాందారుల వారసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఆర్‌సీకి ముందు క్రయవిక్రయాలకు గుర్తింపు లేదు” అని కోర్టు తీర్పులో వివరించింది.