శుక్రవారం గణనాథుల్ని సాగనంపడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై క్లారిటీ రావడంతో మండపాల నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ భారీ క్రేన్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం కోసం GHMC, HMDA, వాటర్ బోర్డు, విద్యుత్ సిబ్బంది రెడీగా ఉన్నారు. దాదాపు 21 కిలోమీటర్లు గణేషుని శోభాయాత్ర జరగనుంది.
శోభయాత్రకు మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 25వేల మందితో బందోబస్తు పెట్టారు. దాదాపు 560 సిసి కెమెరాలతో నిఘా పెడుతున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. రేపు లిక్కర్ షాపులు కూడా బంద్ కానున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు జరిగే ప్రధాన రూట్ లో అడుగడుగునా భద్రతా ఉండేలా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రబలగాలను మోహరిస్తున్నారు. మఫ్టి పోలీసులు, షీ టీమ్స్, రోప్ పార్టీ, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ పోలీసులు ఇలా అన్ని విభాగాలు శోభాయాత్ర బందోబస్తులో పాల్గొంటున్నాయి. రేపు హైదరాబాద్ పరిధిలోని కోర్టులకు కూడా సెలవు ప్రకటించారు.