క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీతో.. తెలంగాణలో విద్యుత్ విప్లవం

రాష్ట్రభవిష్యత్తు విద్యుత్తు అవసరాలను తీర్చడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025’ ను ప్రకటించింది.

గ్రీన్ఎనర్జీ,  క్లీన్ఎనర్జీ అంటే ఏమిటి?  పునరుత్పాదక సహజ వనరులు అనగా ప్రకృతిలో లభించి, ఎంత వినియోగించినప్పటికీ  తరిగిపోకుండా,  ప్రకృతిసిద్ధంగా తిరిగి పొందగలిగే అపరిమితమైన వనరులు. 

పునరుత్పాదక సహజ వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తిని ‘గ్రీన్ ఎనర్జీ’ అంటారు.  గ్రీన్ ఎనర్జీ తయారీకి వాడే ప్రకృతిలో లభించే పునరుత్పాదక సహజ వనరులు,  తయారుచేసే విధానం, దాని వినియోగం పూర్తిగా  పర్యావరణ అనుకూలమై ఉంటుంది. అంటే  ఏదశలోనూ కార్బన్  డై ఆక్సైడ్ వంటి హరిత వాయువులు విడుదలకావు.  ఏ దశలోనూ  పర్యావరణ హాని జరగదు.

హరిత హైడ్రోజన్ (గ్రీన్ హైడ్రోజన్) తయారీకి వాడే  ముడిపదార్థం నీరు.  నీటిని  సౌర శక్తి లేక పవనశక్తిని  ఉపయోగించడం ద్వారా   హైడ్రోజన్ వాయువు తయారవుతుంది. 

హైడ్రోజన్  వాయువును మండించినప్పుడు  నీరు, శక్తి వెలువడుతుంది.  అంటే,  హరిత హైడ్రోజన్ తయారీ నుంచి వినియోగం వరకు ఎక్కడా పర్యావరణానికి  హాని జరగటం లేదు. 

గ్రీన్,  క్లీన్ఎనర్జీ ఉదాహరణలు సౌరశక్తి, పవనశక్తి, బయోఎనర్జీ,  హరిత హైడ్రోజన్ , జియో థర్మల్ ఎనర్జీ మొదలగునవి.  గ్రీన్ఎనర్జీగా  పరిగణించేవన్నీ 'క్లీన్ఎనర్జీ' గా కూడా పరిగణిస్తారు.  

గ్రీన్ఎనర్జీ,  క్లీన్ఎనర్జీల మధ్య గల వ్యత్యాసం  కొన్ని  ఎనర్జీ వనరులు  క్లీన్ ఎనర్జీ వనరులుగా మాత్రమే పరిగణించి,  గ్రీన్ ఎనర్జీ వనరులుగా పరిగణించరు.  క్లీన్ఎనర్జీగా పనిచేసే  ‘అణు విద్యుత్ శక్తి’,  విద్యుత్ వాహనాలలో ఉపయోగించే ‘లిథియం బ్యాటరీ’ లను క్లీన్ ఎనర్జీగా పరిగణించవచ్చును.

 కానీ,  గ్రీన్ఎనర్జీగా పరిగణించలేం. ఎందుకంటే ‘అణువిద్యుత్ శక్తి’ కార్బన్ ఉద్గారాలను,  గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయదు.  కానీ, అణువిద్యుత్ శక్తి తయారీకి వినియోగించే ముడి పదార్థాలు పునరుత్పాదక సహజ వనరులు కావు.  అణువిద్యుత్ శక్తి తయారీలో ఉత్పత్తి అయ్యే అణు వ్యర్థ పదార్థాలు పర్యావరణానికి హాని కలుగజేస్తాయి.  

ఎలక్ట్రిక్​ వాహనాలది  క్లీన్​ఎనర్జీ 

లిథియం, కోబాల్ట్,  మాంగనీస్, గ్రాఫైట్​లు,  లిథియం అయాన్  బ్యాటరీ తయారీలో ఉపయోగపడే  నాలుగు ప్రధాన ముడి పదార్థాలు.  ఇవి భూమిలోపల లభించే ఖనిజాలు. వీటిని గనులను తవ్వడం  ద్వారా వెలికితీస్తారు.  

లిథియం బ్యాటరీ వంటి  పునర్వినియోగ బ్యాటరీ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల మైనింగ్ పర్యావరణ సమస్యలకు దారితీస్తుందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక పేర్కొన్నది.  

నేడు విక్రయిస్తున్న చాలా ఎలక్ట్రిక్ వాహనాలు ఎటువంటి  గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయవు.  అయితే ఈ–వాహనాల బ్యాటరీ  చార్జ్ చేయడానికి  విద్యుత్ వినియోగించబడుతుంది.  అందువలన  అధిక విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలైన పెట్రోల్,  బొగ్గు వంటి వాటిని  మండించవలసి వస్తుంది.  తద్వారా ఇది గ్లోబల్ వార్మింగ్ కు దారి తీస్తుంది.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర 

కాప్26  సదస్సులో భారతదేశం 2030 నాటికి  యాభై శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని, 2070 సంవత్సరం నాటికి భారత్ కార్బన్  ఉద్గార  రహిత దేశంగా మారుతుందని భారతదేశం ప్రకటించింది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలైన పర్యావరణ అనుకూల ఇంధనాలను ప్రవేశపెడుతున్నాయి. పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. 

 జీవ ఇంధనాల  వాడకాన్ని ప్రోత్సహించడానికి  కేంద్రం ‘నేషనల్ బయోఎనర్జీ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను ప్రకటించింది.  అదేవిధంగా పర్యావరణ అనుకూల ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈ– పెట్రోల్)  కార్యక్రమానికి  రూపకల్పన చేసింది. ఈ–పెట్రోల్ ముఖ్య ఉద్దేశం కొద్దిశాతం ఇథనాల్​ను పెట్రోల్​కి కలపటం.  

అమెరికా, అర్జెంటినా, బ్రెజిల్, బంగ్లాదేశ్,  మారిషస్,  సింగపూర్, ఇటలీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో కలిసి భారతదేశం  2023లో   ‘ప్రపంచ జీవ ఇంధన కూటమి’ని ఏర్పరచినది.   జీవ ఇంధన సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడం,  స్థిరమైన జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం,    ప్రపంచ జీవ ఇంధన కూటమి లక్ష్యం. 

రాష్ట్రంలో క్లీన్​ అండ్​ గ్రీన్​ ఎనర్జీ పాలసీ

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు, కాలుష్య  తీవ్రతను 33%  తగ్గించేందుకు  ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025’ ను ప్రకటించింది. 

పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి,  సమన్వయ అభివృద్ధి లక్ష్యంతో రూపొందించిన ఈ పాలసీ 2030 నాటికి 20 వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రాబోయే 10 ఏళ్లలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.14 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించనుంది. 

మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్లు

అదేవిధంగా  మహిళా స్వయం సహాయక బృందాలను సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు   ప్రోత్సహించడం ద్వారా 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. సౌర విద్యుత్ తో పాటు, పవన విద్యుత్, హరిత హైడ్రోజన్ ప్రాజెక్టులను కూడా ప్రోత్సహించేందుకు ఈ విధానం రూపొందించింది.  

కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం దేశంలో  మొత్తం పునరుత్పాదక శక్తి సామర్థ్యం 200 గిగావాట్ దాటింది. ఈ  వృద్ధి 2030 నాటికి శిలాజయేతర వనరుల నుంచి 500 గిగావాట్ శక్తి సామర్థ్యం  సాధించాలనే లక్ష్యానికి చేరువలో ఉంది. 

 గత  సంవత్సరం వరకు భారత దేశ సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో పెరుగుదల 27.9% ఉండగా, పవన విద్యుత్ ఉత్పత్తిలో పెరుగుదల 7.7% ఉన్నది. అదేవిధంగా  బయోపవర్ 11.32  గిగావాట్ ఉత్పత్తిని సాధించినది.   

క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీతో  అనేక ప్రయోజనాలు

భారతదేశంలోని అనేక రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో అగ్రగామిగా నిలిచి  దేశ ప్రగతికి గణనీయంగా తోడ్పడుతున్నాయి.  రాజస్తాన్ 29.98 గిగావాట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది,   29.52 గిగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న గుజరాత్ .. బలమైన సౌర,  పవన శక్తి  ప్రాజెక్టులను  కలిగి ఉంది. 

 తమిళనాడు 23.70  గిగావాట్​తో మూడవ స్థానంలో ఉంది.  సౌర, పవన విద్యుత్  కార్యక్రమాలతో 22.37 గిగావాట్  సామర్థ్యంతో  కర్నాటక  నాలుగో స్థానాల్లో నిలిచింది.  క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.  

పర్యావరణ అనుకూలమైనవి,  గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్  వాయువులను విడుదల చేయవు.  గ్రీన్ పవర్ కొనుగోళ్లు దేశీయ పునరుత్పాదక శక్తి అభివృద్ధికి తోడ్పడతాయి.  క్లీన్ అండ్ గ్రీన్  ఎనర్జీ తయారీ ఉద్యోగాలను సృష్టిస్తుంది. భారతదేశం ఇతర దేశాల నుంచి ఇంధనాల్​ను దిగుమతి  చేసుకోవటం తగ్గిపోతుంది. 

- డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్