వాతావరణ మార్పులతో తిండికి తిప్పలు

వాతావరణ మార్పులు మానవాళిని కలవరపెడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటాన్ని తేలిగ్గా తీసిపారేయలేం. ఎందుకంటే వీటి తాలూకు పరిణామాలు దారుణంగా ఉండబోతున్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం ప్రధానంగా వ్యవసాయ ఉత్పాదకతపై పడి ఆహార కొరత ఏర్పడుతుందని, భవిష్యత్​లో కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించాల్సి వస్తుందని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల 2030 నాటికి 9.06 కోట్ల మంది భారతీయపౌరులు ఆహార సంక్షోభం ఎదుర్కోబోతున్నారని గ్లోబల్​ పాలసీ నివేదిక 2022 పేర్కొంది.

వాతావరణ మార్పుల వల్ల 2030 నాటికి మన దేశ ఆహార ఉత్పత్తి16 శాతం తగ్గి, ఆకలి సమస్య తీవ్రత 23 శాతం పెరగనుందని ఇంటర్నేషనల్​ ఫుడ్​పాలసీ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ​ఫుడ్​ పాలసీ రిపోర్టు 2022లో తెలిపింది. వ్యవసాయోత్పత్తి పడిపోవడం, ఆహార సరఫరాలో ఇబ్బందుల వల్ల దాదాపు 23 శాతం మంది భారతీయులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని నివేదిక చెబుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. వాతావరణ మార్పుల వల్ల 2030 నాటికి 9.06 కోట్ల మంది పౌరులు ఆహార సంక్షోభం ఎదుర్కోబోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఆయా సీజన్లలో మార్పులు అతివృష్టి, అనావృష్టి తదితర ప్రభావాలతో ఇప్పటికే వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతుండగా.. 2050 నాటికి కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తారని, పోషకాహార లోపం, పేదరికం లాంటి సమస్యలు తీవ్రమవుతాయని నివేదిక చెబుతోంది. 

దేశంలో ఆహార కొరత?

పెరుగుతున్న జనాభా, దేశంలో ప్రస్తుత ఆహార ఉత్పత్తిని బట్టి 2030 నాటికి సాధారణంగా 73.9 మిలియన్ల మంది ఆకలి సమస్య ఎదుర్కోబోతున్నారనుకుంటే.. వాతావరణ మార్పులు కూడా అందుకు తోడైతే ఇండియాలో ఆకలితో అలమటించే వారి సంఖ్య  90.6 మిలియన్లకు చేరనుందని గ్లోబల్​ఫుడ్​పాలసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఫుడ్​ప్రొడక్షన్​ఇండెక్స్​కూడా1.6 నుంచి1.5 కి పడిపోనుందని హెచ్చరించింది. 2100 నాటికి భారతదేశమంతటా పెరిగే సగటు ఉష్ణోగ్రతలు 2.4 డిగ్రీ సెల్సియస్​నుంచి 4.4 డిగ్రీ సెల్సియస్​మధ్య ఉంటాయని, ఇండియాలో ప్రస్తుతం వేసవిలో వచ్చే వడగాలులు 2100 నాటికి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని రిపోర్టులో తేలింది. దేశంలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. భారత్​సమశీతోష్ణ మండలంలో ఉంది. కాబట్టి రుతుపవనాలపై ఆధారపడే ఇక్కడ వ్యవసాయం సాగుతుంది. దేశంలో చిన్న, సన్నకారు రైతులు వర్షాధార పంటలే ఎక్కువ సాగు చేస్తారు. వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాలపై ప్రభావం పడినా.. ఎలినినో లాంటి కరువు పరిస్థితులు వచ్చినా.. దేశంలో ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పేదలు ఎక్కువ ఉన్న ఇండియా లాంటి దేశంలో వ్యవసాయం దెబ్బతింటే ఆహారం దొరక్క ఆకలి చావులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార రవాణా, గొలుసులు దెబ్బతింటాయి. 

ఐపీసీసీ నివేదిక కూడా..

గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే ప్రపంచానికి వినాశకర పరిణామాలు తప్పవని ఇంటర్‌‌ గవర్న్‌‌మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(ఐపీసీసీ) నివేదిక కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఐపీసీసీ నివేదిక వాతావరణ మార్పులు ఊహించిన దాని కంటే తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నివేదిక మనిషి బాధల అట్లాస్​అని, ఎన్విరాన్​మెంటల్ ​ఫెయిల్యూర్​ లీడర్​షిప్​ నేరచర్యగా యూఎన్​సెక్రటరీ​జనరల్​ఆంటోనియో గుటేర్రస్​అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో దాదాపు1.1 డిగ్రీ సెల్సియస్​ఉష్ణోగ్రత పెరిగిందని, ఆ ప్రభావం ఇప్పటికే జీవావరణంపై పడిందని ఐపీసీసీ అంచనా వేసింది. ఈ రిపోర్టు ప్రకారం 2008 తర్వాత వరదలు, తుఫానులు ఏటా 20 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్లేలా చేస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ఆఫ్రికాలో పంట ఉత్పాదకత వృద్ధి మూడో వంతుకు తగ్గిపోయింది.

ప్రపంచ జనాభాలో సగం మంది ఏడాదిలో కనీసం ఒక నెల నీటి కొరత ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పు జీవరాశులపై ప్రభావం చూపుతోంది. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల గోల్డెన్ టోడ్, బ్రాంబుల్ కేస్ మెలోమిస్(చిన్న ఎలుక) వంటి జీవులు అంతరించిపోతున్నాయి. ఇతర జంతువులు, సముద్ర పక్షులు కనుమరుగవుతున్నాయి. ఐపీసీసీ అంచనాల ప్రకారం వచ్చే దశాబ్దంలోనే వాతావరణ మార్పు 32,-132 మిలియన్ల మంది ప్రజలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్యారిస్​ ఒప్పందంలో భాగంగా గ్లోబల్ వార్మింగ్‌‌ను1.5 డిగ్రీల వృద్ధికి మించనియొద్దనేది కూడా -అందరికీ సురక్షితం కాకపోవచ్చని ఐపీసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే  1.5 డిగ్రీల సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్‌‌తోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక హిమానీనదాలు పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. 2030 నాటికి అదనంగా 350 మిలియన్ల మంది ప్రజలు నీటి కొరత ఎదుర్కొంటారు.14 శాతం భూగోళ జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.

తక్షణ చర్యలు అవసరం
వాతావరణ మార్పుల ప్రమాదాలను సమర్థవంతంగా పరిష్కరించడం మూడు విధాలుగా సాధ్యపడుతుంది. అందులో మొదటిది వాతావరణ మార్పులు ఆందోళనకర స్థితికి వెళ్లకుండా నివారించడం, రెండోది ఆందోళనకర స్థితికి చేరుకుంటే దాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధమవడం, మూడోది ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఆ పరిస్థితులకు సర్దుబాటు కావడం. ఇలా మూడు స్థాయిలు కీలకమైనవి.  గ్లోబల్​ఫుడ్​పాలసీ సిఫారసు చేసినట్లుగా వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పెట్టుబడులు పెంచాలి. దీంతోపాటు ఆహార వ్యవస్థను ప్రభావితం చేసే నీటిపారుదల, నీటి వనరుల పెంపు, భూవినియోగంపై పరిశోధనలు జరగాలి. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వృథాను అరికట్టాలి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గ్రామీణ జనాభాను సంరక్షించాలి. గ్లోబల్​వార్మింగ్​కు కారణమవుతున్న కాలుష్యం, కర్బన ఉద్గారాలను నియంత్రించాలి.  సౌర విద్యుత్, పవన విద్యుత్ లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకోవాలి. ఐపీసీసీ నివేదిక ప్రకారం ప్రపంచంలో 170 దేశాలు వాతావరణ విధానాలను అనుసరిస్తున్నా.. అవి ప్రణాళికను దాటి అమల్లోకి వెళ్లడం లేదు. అలాంటి పరిస్థితి మారాలె. వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్న దృష్ట్యా ప్రభుత్వాలు, పౌర సమాజం, మేధావులు తక్షణ చర్యలకు పూనుకోవాల్సిన అవసరం ఉంది.
- ఎడిటోరియల్​ డెస్క్​