వెలుగు, నెట్వర్క్: నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో షాద్నగర్, కొడంగల్ మినహా మిగిలిన 12 నియోజకవర్గాల్లో 177 మంది పోటీలో ఉన్నారు. కల్వకుర్తిలో అత్యధికంగా 27 మంది బరిలో ఉండగా, నారాయణపేటలో ఏడుగురు మాత్రమే పోటీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు.
మహబూబ్ నగర్ లో 19 నామినేషన్లు ఆమోదించగా, నలుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. 15 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. జడ్చర్లలో 15 మంది, దేవరకద్ర నుంచి 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు. గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 33 మంది పోటీలో ఉన్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలో ఐదుగురు నామినేషన్లను విత్డ్రా చేసుకోగా, 13 మంది పోటీలో ఉన్నారని చెప్పారు. గద్వాల నియోజకవర్గంలో 20 నామినేషన్లు రాగా, నామినేషన్లను విత్ డ్రా చేసుకోలేదన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 18 మంది పోటీ నుంచి వైదొలిగారు.
నాగర్ కర్నూల్ లో 8 మంది నామినేషన్లు విత్డ్రా చేసుకోగా,15 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. కొల్లాపూర్ లో నలుగురు విత్ డ్రా చేసుకోగా, 14 మంది పోటీలో ఉన్నారు. అచ్చంపేటలో ముగ్గురు విత్డ్రా చేసుకోగా, 14 మంది బరిలో మిగిలారు. కల్వకుర్తిలో ముగ్గురు తప్పుకోగా, 27 మంది పోటీలో ఉన్నారు. వనపర్తిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 13 మంది అభ్యర్థులు మిగిలారు. నారాయణపేటలో ఏడుగురు బరిలో ఉన్నారు. మక్తల్ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థుల్లో ఒకరు విత్డ్రా చేసుకోగా, 11మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.