మోడీ వజ్ర సంకల్పం

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో మనదేశం గొప్ప ముందడుగు వేసింది. వంద కోట్ల కరోనా వ్యాక్సిన్​ డోసులను విజయవంతంగా పూర్తి చేసింది. 100 కోట్ల టీకా భారతాన్ని సాకారం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వజ్ర సంకల్పమే ముఖ్య కారణం. 74 శాతం మందికి వ్యాక్సిన్ డోసులు అందించిన మొదటి దేశంగా ఇండియా నిలిచింది. ప్రధాని మోడీతో పాటు ప్రతి ఒక్కరూ అహర్నిశలూ కృషి చేయడం వల్లే ఇలాంటి ఘనతను మన దేశం సాధించగలిగింది. దేశీయంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం వల్లే వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా సాగింది. పొరుగు దేశాలు, మిత్ర దేశాలకూ వ్యాక్సిన్​ అందిస్తున్నాం.

74 శాతం మందికి వ్యాక్సిన్​ డోసులు
దేశ జనాభాలో 74 శాతం మందికి వ్యాక్సిన్ డోసులు అందించిన మొదటి దేశంగా ఇండియా నిలిచింది. అమెరికాలాంటి దేశంలో 20 కోట్ల డోసులు మాత్రమే పూర్తి చేయగలిగారు. బ్రెజిల్, జపాన్, ఇంగ్లాండ్, ఇండోనేషియా, కెనడా లాంటి దేశాల్లో కూడా ఈ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేయకుండా ఉండి ఉంటే, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా లాంటి కంపెనీలపై ఆధారపడి ఉంటే, మనకు ఇన్ని డోసుల వ్యాక్సిన్ సప్లై కాకపోయేది. అలాగే ఆ కంపెనీలు నిర్ణయించిన ధరకు మనం వ్యాక్సిన్​ కొని ఉంటే సమారు రూ.5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల వరకూ బడ్జెట్ అయ్యేది. కానీ ఇప్పుడు రూ.30 వేల నుంచి 40 వేల కోట్లతోనే వ్యాక్సినేషన్​ పూర్తి చేయగలుగుతున్నాం. ఇన్ని లక్షల కోట్ల ప్రజల సొమ్మును ఆదా చేయడం కూడా ప్రధాని మోడీ గొప్పతనమే. ఆయన నిరంతర పర్యవేక్షణ కారణంగానే ఇంత భారీ స్థాయిలో బడ్జెట్‌ను ఆదా చేయగలిగాం. కరోనా కల్లోల సమయంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించినా ఆ ఘనతను ప్రజలకు చెప్పడంలో మనం విజయం సాధించలేదు.

ప్రజలకు 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను నిరాటంకంగా పూర్తి చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోడీదే. ఇంకా రాష్ట్రాల వద్ద 10 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో ఇంకా 22 కోట్ల కోవీషీల్డ్, 6 కోట్ల కోవాక్సిన్ డోసులు కేంద్రానికి అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా వ్యాక్సిన్​ ఉత్పత్తి చేయడం వల్లే మనం ఈ ఘనత సాధించాం. ప్రపంచంలోని 190 దేశాల్లో 130 దేశాలు మన దేశం నుంచే కరోనా వాక్సిన్​ను కోరుకుంటున్నాయి. అయితే మన దేశ అవసరాలు తీరిన తర్వాతే ఇతర దేశాలకు వ్యాక్సిన్​ను ఎగుమతి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనవరి నుంచి బడుగు, పొరుగు దేశాలకు టీకాల సరఫరాను మనదేశం మొదలుపెట్టింది. ఇప్పటికే నేపాల్ కు 10 లక్షల డోసులు, ఇండోనేషియాకు 10 లక్షలు, మయన్మార్‌కు 10 లక్షలు, బంగ్లాదేశ్ కు 10 లక్షల డోసులు పంపించాం. ఈ నెలలో 2 కోట్ల డోసులను మిత్ర దేశాలకు అందించనున్నాం. మన ఔదార్యంపై డబ్ల్యూహెచ్​వో, అమెరికాతోపాటు ప్రపంచ దేశాల నాయకులు ప్రశంసలు కురిపించారు.
వ్యాక్సినేషన్​లో ప్రపంచానికే దిక్సూచి
కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తిలో ప్రపంచానికే మనదేశం దిక్సూచిగా మారింది. వ్యాక్సిన్ ఉత్పత్తి అంత ఆషామాషీ కాదు. ఒక వ్యాక్సిన్ ల్యాబ్​ నుంచి జనంలోకి రావాలంటే, ఇన్ని కోట్ల డోసులు తయారు చేసి ప్రజలకు ఇవ్వాలంటే, రా మెటీరియల్ నుంచి వినియోగదారునికి చేరే వరకు ప్రొడక్షన్, సప్లై చైన్, డెలివరీ వంటి ఎన్నో సంక్లిష్ట దశలను దాటాలి. వ్యాక్సిన్ ఉత్పత్తి అయ్యాక బ్యాచ్​​ టెస్టులు చేయాలి, కోల్డ్ స్టోరేజీ నుంచి ఎయిర్ పోర్ట్ కు అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు, జిల్లాలకు, అన్ని మండలాల్లోని కోల్డ్ స్టోరేజీకి, అక్కడి నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ చేరే వరకు కృషి చేయాలి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం మానవ వనరులను సిద్ధం చేసుకోవాలి. సిరంజ్‌లు, నీడిల్స్, కోల్డ్ స్టోరేజీలు కావాలి. వ్యాక్సిన్ సరఫరా కోసం ట్రక్కులు కావాలి. ఇందుకోసం అనేక చోట్ల మౌలిక వసతులు కల్పించాలి. మరోవైపు ముడి పదార్థాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని కేంద్రం నిశ్చయించింది. వీటన్నింటినీ మనదేశం సక్సెస్​ఫుల్​గా పూర్తి చేయగలిగింది. ఇదంతా మోడీ నిర్విరామ కృషితోనే సాధ్యమైంది.
వ్యాక్సిన్​ తయారీపై నిరంతర పర్యవేక్షణ
సైంటిస్టులను, ఫార్మా కంపెనీలను ప్రోత్సహించడమే కాకుండా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షిస్తూ అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం పకడ్బందీ ప్రణాళికను రూపొందించేలా చేశారు. వ్యాక్సిన్ తయారీపై త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు 2020 జూన్ లోనే ప్రధాని ఒక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేశారంటే ఆయన ఎంత దూరదృష్టితో ఆలోచించారో మనకు అర్థమవుతుంది. దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఐసీఎంఆర్‌ను కూడా భాగస్వామ్యం చేశారు. 2020 నవంబర్ నెలాఖరులోనే మోడీ స్వయంగా వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను సందర్శించారు. అలాగే వ్యాక్సిన్ తయారీ కోసం అవసరమైన అన్ని సంస్థలతో నిరంతరం చర్చలు జరిపారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చి భారత్ బయోటెక్​ను సందర్శించి సైంటిస్టుల మనోబలాన్ని పెంచారు.
రాష్ట్రాలకు మార్గనిర్దేశం
కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో రాష్ట్రాలకు ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు మార్గ నిర్దేశకత్వం అందించారు. వ్యాక్సిన్ విషయంలో కూడా ముఖ్యమంత్రులకు తగిన సూచనలను ఇచ్చారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల కారణంగానే కరోనా మహమ్మారి వల్ల మన దేశంలో అతి తక్కువ శాతం మంది మృత్యువాత పడ్డారు. ఇవాళ 135 కోట్లకు పైగా ఉన్న దేశ జనాభాకు దశలవారీగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని సిద్ధం చేసిన ఘనత కూడా నరేంద్రమోడీకే దక్కుతుంది. 2021 జనవరి కల్లా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసింది మోడీ సర్కార్. జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయడం ప్రారంభమైంది. మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, 60 ఏండ్లు పైబడిన వారికి, తర్వాత 45 ఏండ్ల వారందరికీ, ఆ తర్వాత 18 ఏండ్లు నిండిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తూనే ఉంది. 
ప్రతిపక్షాల కుట్రలు భగ్నం
వ్యాక్సినేషన్​ ప్రక్రియ విజయవంతం కావడాన్ని ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌పై రకరకాల దుష్ప్రచారాలతో ప్రజల్లో అశాంతిని రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచమంతా మన దేశ శాస్త్రవేత్తలను కొనియాడుతుంటే, వ్యాక్సిన్​కు తొందరపడి అనుమతులు ఇచ్చారని, ఇది ప్రమాదకరమని కాంగ్రెస్ చెప్పడం దారుణమైన విషయం. ఇప్పటికే మైనారిటీలను, రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించిన ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మన సైంటిస్టులను అవమానిస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడాలనుకున్నాయి. ముఖ్యమంత్రులతో ప్రధాని పలు దఫాలుగా చర్చించాక 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్​ ఇవ్వాలని రాష్ట్రాలు కోరాయి. అయితే ఆ తర్వాత తమ బాధ్యతను మరిచి కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేశాయి. ఈ విమర్శలను తిప్పికొడుతూ దేశంలో 18 ఏండ్లు పైబడ్డ వారందరికీ ఉచితంగా రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే 100 కోట్ల వ్యాక్సిన్​ డోసులు పూర్తయ్యాయి.

డిసెంబర్​ 31 లోగా 200 కోట్ల డోసులు
కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి 5 కంపెనీలకు మోడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ 5 కంపెనీలు ప్రతి నెలా 30 కోట్లకు పైగా డోసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ 31లోగా దేశంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అలాగే 18 ఏండ్ల లోపు వారికి కూడా స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తయారు చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఎప్పుడైనా ఈ ప్రక్రియ ప్రారంభం కావొచ్చు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి వ్యక్తి వ్యాక్సిన్ తీసుకునేలా విస్తృతంగా ప్రచారం చేయాలి. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో కొందరికి, సంచార జాతులవారైన కొంత మందికి ఆధార్ కార్డులు లేవు. ఇలాంటి వారితోపాటు వ్యాక్సిన్​ వేయించుకోవడంపై అవగాహన లేని వారికీ టీకా అందించేందుకు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు చొరవ తీసుకోవాలి. తద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయడానికి కృషి చేయాలి.