చండూరు, వెలుగు : మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన రాజీనామాతో పదవి పోయినా నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. శనివారం నియోజకవర్గంలోని చండూరు మండలం బోడంగిపర్తి, శిర్డేపల్లి, ఉడతలపల్లి, పడమటితాళ్ల, చామలపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనుకుంటే గల్లీగల్లీకి బెల్లు షాపులు వచ్చాయన్నారు.
బీఆర్ఎస్ ను బొంద పెడితేనే నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయన్నారు. కేసీఆర్ కుటుంబ, రాచరిక పాలనను తరిమికొట్టడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రజల బతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. కాగా, చండూరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాజగోపాల్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.