అంత్యక్రియలకు డబ్బుల్లేక గోనె సంచిలో వేసి రోడ్డుపై పడేశిండు

 అంత్యక్రియలకు డబ్బుల్లేక గోనె సంచిలో వేసి రోడ్డుపై పడేశిండు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య  మృతదేహాన్ని గోనె సంచిలో వేసి రోడ్డుపై పడేశాడు.  చందన్ నగర్ ప్రాంతంలో పాడుబడిన గోనె సంచిలో 57 ఏళ్ల ఆశా నర్గవే అనే మహిళ మృతదేహం లభ్యమైందని ఏసీపీ నందిని శర్మ తెలిపారు. మహిళ శరీరంపై ఎలాంటి గాయం కనిపించలేదని తెలిపారు. ఆమె చాలా కాలంగా కాలేయ సమస్యలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని, దీంతో ఆమె సహజ మరణానికి దారితీసిందని పోస్టుమార్టంలో తేలింది. 

విచారణలో ఆ మహిళ గత పదేళ్లుగా ఓ వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తేలింది. పోలీసులు విచారించగా, రాజ్‌మొహల్లా ప్రాంతంలోని తోటలో ఆమె భర్త 53 ఏళ్ల మదన్ నర్గావే  అనే వ్యక్తి కనిపించాడు.  ఆ వ్యక్తి ఆమె మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లోనే ఉంచినట్లుగా విచారణలో తేలింది. నిజానికి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో వేసి తన ఇంటికి 200 మీటర్ల దూరం తీసుకెళ్లి రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయాడు మదన్ నర్గావే. ఆ తరువాత పశ్చాత్తాపంతో రాజ్‌మొహల్లాలోని తోటలోకి వెళ్లి కూర్చున్నాడు.  

మొదట్లో ఒక ఇంటి బయట మృతదేహం కనిపించడంతో చందన్ నగర్ పోలీస్ సర్కిల్‌లోని అహ్మద్ నగర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.  అంత్యక్రియలకు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తాను ఈ పని చేసినట్లుగా విచారణలో వెల్లడించాడు మదన్ నర్గావే. విచారణ అనంతరం  పోలీసులు మహిళకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చందన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇంద్రమణి పటేల్ తెలిపారు.