భీమదేవరపల్లి, వెలుగు : పొత్తులు ఉన్నా, లేకున్నా హుస్నాబాద్ బరిలో ఉంటామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల యాక్సిడెంట్‌లో చనిపోయిన మాడుగుల భానుప్రసాద్ ఫ్యామిలీని సోమవారం ఆయన పరామర్శించారు. తర్వాత కొత్తపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్నారు. సీపీఐకి బీజేపీయే ప్రథమ శత్రువన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రైతుబంధు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వవద్దో ప్రభుత్వానికే స్పష్టత లేదన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఫ్యామిలీకి రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సమాఖ్య జిల్లా కార్యదర్శి కొంగల రాంచంద్రారెడ్డి, లక్ష్మి, మంచాల రమాదేవి, సీపీఐ మండల కార్యదర్శి ఆదరి శ్రీను, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు మంచాల తిరుపతి,ఆదరి రమేశ్ పాల్గొన్నారు.