
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ క్రేజీ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఎస్ఎస్ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ షూటింగ్‌ను పకడ్బందీగా పక్కా ప్లానింగ్‌తో రూపొందిస్తున్నారు రాజమౌళి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. 2027 మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.
అదే డేట్‌కి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలైంది. ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతోపాటు ఆస్కార్ అవార్డును సైతం కైవసం చేసుకోవడంతో ఆ డేట్ బాగా కలిసొచ్చిందని.. అదే సెంటిమెంట్‌తో మహేష్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, యూరోప్ దేశాల్లోనూ ఈ మూవీ షూటింగ్‌కు ప్లాన్ చేసినట్టు సమాచారం. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం
అందిస్తున్నారు.