హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలకు పెరుగుతున్న ఓపీ

హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలకు పెరుగుతున్న ఓపీ

జలుబు, దగ్గు, జ్వరంతో వెళ్తున్న వారే ఎక్కువ
ఓపీల్లో 60 శాతం మంది చిన్నారులే
ఆదివారం కూడా అందుబాటులో సేవలు

హైదరాబాద్, వెలుగు : సీజనల్ వ్యాధులతో ఒక్కో బస్తీ దవాఖానాలో డైలీ ఓపీ(ఔట్ పేషెంట్) సంఖ్య వంద దాటుతోంది. అయితే ఇందులో పెద్దవాళ్లకంటే పిల్లలే ఎక్కువ శాతం ఉంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. దాదాపు 60 శాతం పీడియాట్రిక్ ఓపీ ఉంటోందంటున్నారు. ప్రస్తుతం బస్తీ దవాఖానాలు ఆదివారం కూడా అందుబాటులో ఉంటున్నాయి. శనివారం క్లోజ్ చేస్తున్నారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలో 259 బస్తీ దవాఖానలున్నాయి. వానాకాలానికి కు ముందు వరకు ఒక్కో బస్తీ దవాఖానకు రోజుకి 50 నుంచి 60 మంది పేషెంట్లు వెళ్లేవారు. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనాలు రోగాల బారినపడుతున్నారు.

రోజువారీ ఓపీ వంద నుంచి 130 ఉంటే అందులో 60 శాతానికిపైగా పిల్లలు వస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుందని బస్తీ దవాఖానల డాక్టర్లు చెప్తున్నారు. పిల్లల్లో ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గుతో వెళ్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. గతంలో సీజనల్ వ్యాధులు వస్తే గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్ హాస్పిటల్స్ లేదా దగ్గరలోని పీహెచ్​సీలకు, ప్రైవేటు క్లినిక్​లకు ఎక్కువగా వెళ్లేవారు. కానీ గ్రేటర్ పరిధిలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు కావడంతో చాలామంది వీటినే ఆశ్రయిస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు.

వరుసగా వర్షాలు కురుస్తుండటం, దోమల బెడద, ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంతో చిన్నపిల్లలు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. హాస్పిటల్​కు వెళ్లిన తర్వాత డాక్టర్లు చెకప్ చేసి మెడికేషన్ ఇవ్వడంతో పాటు సమస్య తీవ్రంగా ఉంటే టెలి మెడిసిన్ ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా పెద్దాసుపత్రుల్లోని సంబంధిత డాక్టర్​కు సైతం ఆన్ లైన్ ద్వారా  పిల్లలను చూపిస్తూ కన్సల్టేషన్ ఇప్పిస్తున్నారు. డాక్టర్లు ఆన్ లైన్ కన్సల్టేషన్ ద్వారా పిల్లలను పరీక్షించి మెడికేషన్ ఇస్తున్నారు. 

ఫీవర్ కేసులు ఎక్కువ..
మా బస్తీ దవాఖానాకు రోజు 130 మందికి పైగా ఓపీకి వస్తున్నారు. ఇందులో పిల్లలు,  25 ఏండ్ల లోపు వారు ఎక్కువగా ఉంటున్నారు. ఫీవర్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఇక్కడే  ట్రీట్ మెంట్ ఇస్తున్నాం. మేనేజ్ చేయలేని కేసులను టెలి కన్సల్టేషన్ ద్వారా పరిష్కరిస్తున్నాం. 
- డాక్టర్ లత, బస్తీ దవాఖానా, షేక్ పేట

ప్రతి చోటా ఓపీ పెరిగింది
బస్తీ దవాఖానాలకు వచ్చే పేషెంట్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.  పెద్దాసుపత్రులకు వెళ్లడానికి భయపడే వారందరూ వీటినే ఆశ్రయిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడే పిల్లలను ఎక్కువగా బస్తీ దవాఖానాలకే తీసుకెళ్తున్నారు. ప్రతి బస్తీదవాఖానాలోనూ రోజుకి వందకుపైనే ఓపీ ఉంటోంది.   
- డాక్టర్ అనురాధ, డిప్యూటీ డీహెచ్ఎంవో