మహానగరంగా మారిన అరణ్యం

మేడారం  ప్రతినిధి, వెలుగు: సారలమ్మ రాకతో మేడారంలో సంబురమొచ్చింది. బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ రాత్రి వేళ గద్దెలపై చేరింది. అమ్మల రాక మొదలుకావడంతో మేడారం జనగుడారంగా మారిపోయింది. లక్షలాది మంది భక్తులు చేరి మహానగరంగా రూపుదాల్చింది. అంతా గుడారాలు వేసుకొని సొంతింటిలో ఉంటున్నట్టు మురిసిపోతున్నారు. కన్నెపల్లి, నార్లాపూర్‌‌, మేడారం ఎక్కడ చూసినా గుడారాలే. గుండ్లు చేయించుకునేవాళ్లు, ఎదుర్కోళ్లు ఇచ్చేవాళ్లు, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేవాళ్లు, ఒడి బియ్యం సమర్పించేవాళ్లు, బంగారంతో తులాభారం ఇచ్చేవాళ్లు, కోయదొరల భవిష్యవాణి దృశ్యాలతో జాతరలో కోలాహలం నెలకొంది.

టెంపరరీ ఇండ్లుగా...

మేడారానికి వచ్చిన భక్తులు ఎక్కడ జాగా దొరికితే అక్కడ గుడారాలు వేసుకుని ఉంటున్నారు. పది, ఇరవై కుటుంబాలు కలిసి ట్రాక్టర్లు, వ్యాన్లు, లారీల్లో వస్తే వాటినే షెల్టర్​గా మార్చుకుంటున్నారు. కొందరైతే వీటిపై రేకులు కూడా వేసుకుని టెంపరరీ ఇండ్లలా మార్చుకున్నారు. సాయంత్రం వేళల్లో డీజే పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్​ చేస్తున్నారు. కొందరైతే జాతరకు దూరంగా ఉన్న అడవుల్లో చెట్ల కిందే మకాం వేస్తున్నారు.  

జంపన్న వాగులో సంబురంగా స్నానాలు

మొదటి రోజు జాతరకు వచ్చిన వారితో జంపన్న వాగు కళకళలాడింది. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్లనే తేడా లేకుండా అంతా వాగులో స్నానాలు చేశారు. చలి బాగా ఉండడంతో చాలామంది పిల్లలకు వేడినీళ్లను కొని  స్నానాలు చేయించడం కనిపించింది.  కొంతమంది వాగు ఒడ్డున షవర్​ బాత్ ​చేశారు